హైదరాబాద్: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇవాళ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రెండింటికీ మొండి చెయ్యే చూపించారు. విశాఖ రైల్వే జోన్ అదిగో… ఇదిగో అంటూ టీడీపీ నేతలు కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తుండగా, ఇవాళ్టి బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. కోనసీమవాసులకు కూడా కేంద్రం నిరాశను మిగిల్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ గురించి కూడా ప్రస్తావించలేదు. ఏపీకి ఒక్క కొత్త రైలుగానీ, ఒక్క లైన్ గానీ ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన అనేక విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసినట్లు కనబడుతోంది. అమరావతిలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తానని, అమరావతిని ఏపీలోని అన్ని జిల్లాలకూ కలుపుతూ లైన్ వేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పటికీ అవేమీ జరగలేదు. రైల్వే యూనివర్సిటీని గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఏపీకి దక్కింది చూస్తే, విజయవాడ-నాగపూర్ మధ్య ట్రేడ్ కారిడార్, విజయవాడ-కాజీపేట మధ్య మూడో లైన్ ఏర్పాటు, ఆధ్యాత్మిక రైల్వేస్టేషన్‌గా తిరుపతి స్టేషన్ అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నాయి. కోటిపల్లి-నర్సాపురం లైనుకు రు.200 కోట్లు, పిఠాపురం-కాకినాడ రైల్వేలైన్‌కు రు.50 కోట్లు కేటాయించారు.
మరోవైపు తెలంగాణకు కూడా ఇదే పరిస్థితి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. యాదగిరిగుట్టవరకు ఎంఎంటీఎస్ పొడిగించాలన్న ప్రతిపాదనను కూాడ పట్టించుకోలేదు. కొత్త రైళ్ళుగానీ, లైన్లుగానీ లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎంఎంటీఎస్ విస్తరణ చేస్తామని మాత్రం రైల్వే మంత్రి చెప్పారు. విభజన హామీలను పట్టించుకోనట్లు స్పష్టంగా కనబడుతోంది.