కలెక్షన్ కింగ్‌గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇప్పుడు పూర్తి స్థాయిలో పరువు పోగొట్టుకున్నారు. సన్నాఫ్ ఇండియాకు కనీస ఆక్యుపెన్సీ కూడా లేక వందల షోలు రద్దు చేశారు. మోహన్ బాబు సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇదంతా మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ చేసుకున్న స్వయంకృతమేనన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోది.
నాసిరకం సినిమా !
సన్నాఫ్ ఇండియా అనే పేరే ఎంత అనాసక్తిగా ఉందో సినిమా చిత్రీకరణ కూడా అంతే దారుణంగా ఉంది. సినిమాలో ఎక్కడా నిర్మాణ విలువలనేవే కనిపించవు.చివరికి రెండు కోట్ల గ్రాపిక్స్ పాట అంటూ మోహన్ బాబు గొప్పగా చెప్పుకున్న పాటను ప్రోమోలో చూసిన వారికి విరక్తి పుట్టేసింది. అంత దారుణంగా ఉన్న గ్రాఫిక్స్‌కు మోహన్ బాబు ఎలివేషన్లు చూసి జనాలు కామెడీగా తీసుకోవడం ప్రారంభించారు. ఓటీటీ సినిమా అని.. అక్కడ ఎవరూ తీసుకోకపోతే తప్పనిసరిగా ధియేటర్లో విడుదల చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇక అవసరం లేదన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. అంతే లైట్తీసుకున్నారు. మంచు ఫ్యామిలీ డబ్బులకు కక్కుర్తి పడి ఇంత నాసిరకంగా సినిమా తీస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.
అనర్థం చేసిన అతి ప్రచారం !
సన్నాఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ లేని సినిమా అని ముందుగానే చాలా మందికి ఓ అభిప్రాయం ఏర్పడింది. అది ఇన్ సైడ్ టాక్ అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు మంచు ఫ్యామిలీ చేసిన ప్రచారం మాత్రం ఓ రేంజ్లో ఉంది. మాటలు కోటలు దాటేలా ప్రచారం చేశారు. మోహన్ బాబు సహా అందరిదీ అదే దారి. ప్రిరిలీజ్ ఈవెంట్‌తో పాటు ఇంటర్యూల్లో వారు చేసిన ప్రకటనలు ట్రోలింగ్‌కు గురయ్యాయి. చివరికి అవన్నీ కనీస టిక్కెట్లు తెగ్గొట్టడానికి కూడా ఉపయోగపడలేదు సరి కదా మరింత వ్యతిరేకత మిగిల్చింది.
వ్యక్తిగతంగా ప్రవర్తనతోనూ ప్రేక్షకులకు దూరమయ్యారు !
ఇదంతా సోషల్ మీడియా కాలం. నటుల ఇమేజ్ను వారి వ్యక్తిగత ప్రవర్తన కూడా డిసైడ్ చేస్తోంది. ఈ విషయం మోహన్ బాబు ఫ్యామిలీకి తెలుసో తెలియదో తెలిసి చేస్తారో కానీ వారు చేసిన చేష్టల వల్ల పూర్తిగా ప్రజాదరణ కోల్పోయారు. వారికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ లేదు. ఉన్న వారిని వారి అతి ప్రవర్తన వల్ల కోల్పోయారు. ఇండస్ట్రీ రాజకీయాల వల్ల కావొచ్చు.., బయట రాజకీయాల వల్ల కావొచ్చు. అతి అంటే మోహన్ బాబు ఫ్యామిలీ.. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే అతి అనే ముద్రపడిపోయింది. చివరికి ట్రోలర్లకు పని చెప్పడానికి తప్ప ఇంక వారు ఇండస్ట్రీకి పనికి రారన్న అభిప్రాయం ఏర్పడింది.
మోసగాళ్లుతో ఓటీటీ మార్కెట్ కోల్పోయిన మంచు ఫ్యామిలీ !
సన్నాఫ్ ఇండియాను ఓటీటీలు ఎందుకు తీసుకోలేదన్నది చాలా మందికి తెలియదు. చాలా చిన్న సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. మరి మోహన్ బాబు సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే.. దానికి కారణం మోసగాళ్లు అనుకోవచ్చు. మోసగాళ్లు సినిమాను అడ్డం పెట్టుకుని అమెజాన్ ప్రైమ్‌ను మంచు విష్ణు అడ్డంగా ముంచేశారన్న అభిప్రాయం ఉంది. రూ. యాభై కోట్లు పెట్టి తీశామని ప్రచారం చేసుకున్నా అదో నాసిరకం సినిమా. కానీ ప్రచారాన్ని నమ్మి అమెజాన్ కోట్లు కుమ్మరించింది. ఆ దెబ్బతో ఓటీటీ మార్కెట్ మాత్రం మంచు ఫ్యామిలీ జోలికి వెళ్లకూడదని డిసైడయిందని తెలుస్తోంది. అంటే ఒక్క సారి మోసం చేసి.. పూర్తి స్థాయిలో మార్కెట్ కోల్పోయారన్నమాట. ఇక మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో పుట్టగతులు ఉండటం కష్టమేనన్నది ఈ రోజుతో చాలా మందికి వచ్చిన ఓ నిశ్చితాభిప్రాయం.