వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హైప్రోఫైల్ కేసు కావడంతో సీబీఐ డీఐజీ కూడా పులివెందులకు వచ్చారు. ఆయన కీలక అరెస్టులు నిర్వహించే వరకూ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. దస్తగిరిని అప్రూవర్‌గా కోర్టు అనుమతించిన తర్వాత మరోసారి న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు. ఇది రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఆ వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీలో కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.
నిజానికి గత డిసెంబర్లోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఢిల్లీలోని సీబీఐ వర్గాల నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. దీనికి సంబంధించిన ముందస్తు సన్నాలు కూడా పూర్తి చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ కారణగా పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయంపై అవినాష్ రెడ్డి క్యాంప్ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
వైఎస్ వివేకా కేసును సీబీఐ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. చురుగ్గా విచారణ జరుపుతున్న అధికారులపై ఆరోపణలు చేయించి మరో రకంగా సీబీఐపైనే ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టకుండా.. కేసును చేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో గతంలో ఉన్నంత తేలిక భావంతో సీబీఐ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.