తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ లీకు మీడియాకు పంపారు. శనివారం ఆయన ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయంలో జగ్గారెడ్డి చాలా కాలంగా “స్పాయిలర్”గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం పెట్టినా సరే సొంత పార్టీపై విమర్శలు చేస్తూ తెరమీదకు వస్తున్నారు. దాంతో మీడియా ఆయనకూ ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వస్తున్నారు.
ఆయనపై క్రమశిక్షణా కమిటీ చాలా సార్లు చర్యలు తీసుకోవాలని కూడా అనుకుంది.చివరికి ఆయనే బయటకు వెళ్లిపోవాలని డిసైడయినట్లుగా మీడియాకు లీకులు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు లోలోపల ఆనందపడుతున్నారు. ఎన్నికల మూమెంట్ వచ్చిన సమయంలో జగ్గారెడ్డి లాంటి వ్యక్తి స్పీడ్ బ్రేకర్లా పని చేసి ఇబ్బందులు సృష్టించడం తప్ప .. పార్టీకి ప్రయోజనం లేదని గట్టిగా నమ్ముతున్నారు.
జగ్గారెడ్డి చాలా కాలంగా టీఆర్ఎస్ కోవర్టుగా పని చేస్తున్నారని కాంగ్రెస్లో అనుమానం ఉంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత టీఆర్ఎస్లో చేరితే అదే అనుమానం నిజం కావొచ్చు. కానీ జగ్గారెడ్డికి టీఆర్ఎస్లోకి ఆహ్వానం ఉంటుందా.. ఒక వేళ ఉన్నా.. తర్వాత టిక్కెట్ ఇస్తారా అన్నది డౌటే. ఎలా చూసినా జగ్గారెడ్డి రాజకీయ జీవితానికి ముగింపేనని.. ఆయన చేజేతులా చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.