తెలుగు మీడియా సంస్థలు ఎన్నో నీతులు చెబుతూ ఉంటాయి. ప్రభుత్వాలకు పెద్ద పెద్ద హితోక్తులు చెబుతూంటాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని.. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూంటాయి. కానీ ఆ చానెల్స్‌లో అరకొర జీతాలకు పని చేస్తున్న వారి హక్కులను ఆ యాజమాన్యాలు కనీస మాత్రంగా అయినా కాపాడుతున్నాయా అంటే క్వశ్చన్ మార్కే. ఇలాంటి విషయంలో ఓ చానల్‌ది మరీ అతి.. అంటే అతి. ఎంత అతి అంటే.. చివరికి పని చేయడానికి వచ్చే ఉద్యోగులకు మంచి నీళ్లు కూడా ఇవ్వరు. ఎవరికి వాళ్లు చందా వేసుకుని వాటర్ క్యాన్ వేయించుకుని తాగాల్సిందే.
చానల్ మొత్తం మీద ఉండే మూడు నాలుగు, ఫ్లోర్లలో వివిధ డిపార్టుమెంట్ ఉద్యోగులు ఎవరికి వారు చందాలు వేసుకుని నెలవారీగా డబ్బులు కట్టుకుని మంచినీళ్లు తాగుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో కరోనా పేరుతో జీతాలు పెంచకపోగా.. తగ్గించడం లాంటి పనులకు చేయడంతో చాలా మంది ఆఫీసులోనూ మంచినీళ్లకు కట్టుకోవడం భారం అయిపోయి మానేశారు.దీంతో ఇప్పుడు అక్కడ రచ్చ జరుగుతోంది. మంచి నీళ్లు కూడా ఇవ్వరా అని ఉద్యోగులు గొణుక్కుంటున్నారు.
కొంత మంది ఉద్యోగులు దాహాన్ని తట్టుకోలేక ఒకటి రెండు ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లను తెచ్చుకుని తాము మాత్రమే తాగేలా తాళ్లు కట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా సంస్థ బాధ్యతలు చూసే పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు. తెలియదా అంటే తెలుసు… ఎంత బాగా తెలుసుంటే… ఎప్పుడైనా తమకు టీ తాగాలనిపిస్తే నీళ్లు కూడా అలా ఉద్యోగులు తెచ్చుకున్న క్యాన్ నుంచే తెచ్చుకుని టీ పెట్టుకుంటారు.. అంత బాగా తెలుసు. అక్కడి పరిస్థితిని వర్ణించడానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదమో ?
విచిత్రం ఏమిటంటే చానల్ సంక్షేమం కోసం వేల్ఫేర్ ఫండ్ పేరుతో కొంత మొత్తం జీతం నుంచి వసూలు చేస్తారు కూడా. ఈ చానల్ గురించి అక్కడి ఉద్యోగులు.. మాజీ ఉద్యోగులు చెప్పే విశేషాలు సంభ్రమాశ్చర్యలకు లోను చేసేలా ఉంటాయి. అవన్నీ ముందు ముందు చెప్పుకుందాం..!