సన్ ఆఫ్ ఇండియా చిత్రం విడుదలకు ముందు మోహన్ బాబు మీద, ఈ సినిమా మీద జరిగిన ట్రోలింగ్ తెలిసిందే. అయితే దీనిపై మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
ట్రోలింగ్ చేయడానికి అవతలి వారికి అవకాశం ఇచ్చింది మోహన్ బాబు కుటుంబ సభ్యులే:
నిజానికి ట్రోలింగ్ చేయడానికి అవతలి వారికి అవకాశం ఇచ్చింది మోహన్ బాబు కుటుంబ సభ్యులే . మంచు లక్ష్మి కి ఆస్కార్ అవార్డు రావడం ఖాయం అని మోహన్ బాబు గతంలో ఒక ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు హాస్యాస్పదంగా అనిపించాయి. ఇతర భాషల చిత్రాలను కేవలం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని, అత్యంత అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే విదేశీ భాష చిత్రాలలోని నటులను అవార్డుకు పరిగణనలోకి తీసుకుంటారని మోహన్ బాబు కి తెలియకుండా ఉంటుందా, ఒకవేళ తెలిసినా ప్రేక్షకులకు ఆమాత్రం పరిజ్ఞానం ఉండదన్న ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానం అప్పట్లో ప్రేక్షకులకు కలిగింది.
మరొక సందర్భంలో మంచు విష్ణు మాట్లాడుతూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరును, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న టంగుటూరి ప్రకాశం పేరు ను కన్ఫ్యూజ్ అయి, రెండు పేర్లను కలిపి మరొక కొత్త రకం పేరును పలకడం కూడా ట్రోలింగ్ చేసేవారికి అవకాశం ఇచ్చినట్లు అయింది. మోహన్ బాబు, మంచు విష్ణు ల కంటే ఎక్కువగా మంచు లక్ష్మి కూడా ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటుంది. నిలదీయడం లాంటి తెలుగు పదాన్ని ” i want to నిలదీసిఫై” వంటి విచిత్రమైన పద ప్రయోగాలు చేయడం, తనను ఇండియన్ అని ఎవరూ అనుకోరు అని ఒక సందర్భంలో మాట్లాడడం, వంటివి మంచు లక్ష్మి ని సోషల్ మీడియా టార్గెట్ చేయడానికి కారణం అయ్యాయి. వీటన్నింటికి మించి స్టేజ్ ఎక్కగానే మంచు వారి కుటుంబం తమని తాము విపరీతమైన స్థాయిలో పొగుడుకోవడం కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు.
విపరీతంగా హిట్ అయిన మంచు కుటుంబం పై ట్రోలింగ్ వీడియోలు
పైన చెప్పిన కారణాల వల్ల చాలా మంది ప్రేక్షకులకు మంచు ఫ్యామిలీ మీద వచ్చే మీమ్స్, ట్రోలింగ్ ల కు బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగు సినిమా కామెడీ సీన్స్ కోసం యూట్యూబ్లో గతంలో సెర్చ్ చేసిన తాము ఇప్పుడు మంచు ట్రోలింగ్ వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నామంటూ కొందరు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రేక్షకులలో ఉన్న ఈ ఆసక్తిని గమనించి ఒకరిని మించి ఒకరు మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ వీడియో లలో మంచు మనోజ్ ని ఎక్కడా పెద్దగా టార్గెట్ చేయకపోవడం గమనార్హం. మంచు మనోజ్ ఎప్పుడూ మిగతా ముగ్గురి లాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోకపోవడం ద్వారా ఆయనపై ట్రోలింగ్ చేసే అవకాశం ఆయన ఇతరులకు ఇవ్వలేదు
దావా వేయడానికి మోహన్ బాబు సిద్ధమయ్యారా ?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మోహన్ బాబు కుటుంబం ఎదుర్కొన్నంత ట్రోలింగ్ మరి ఎవరు కూడా ఎదుర్కొని ఉండరు. అయితే దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా అడ్మిన్ లకు లీగల్ నోటీసులు పంపించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే 10 కోట్ల దాకా వీరి పై దావా వేయడానికి మోహన్ బాబు సిద్ధపడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా పేజీల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మోహన్ బాబు సిద్ధపడుతున్నారు అంటూ వస్తున్న వార్తలు చర్చకు దారితీస్తున్నాయి.
దావా వేయడం సరైన నిర్ణయమేనా ?
నిజానికి అగ్ర హీరోలు అగ్ర నిర్మాతలు అగ్ర దర్శకులు సైతం ఆయా సందర్భాలలో ఇటువంటి ట్రోలింగ్ కు గురికావడం సహజం. ఒక సినిమా ఫ్లాప్ అవగానే ఆ సినిమా ఇదే తరహా ట్రోలింగ్ కి గురికావడం కూడా సహజం. వాటికి ఆయా హీరోలు దర్శకులు నిర్మాతలు పెద్దగా స్పందించరు. కొందరైతే తమ పై వచ్చే మీమ్స్ చూసుకుని సరదాగా నవ్వుకుంటామని హుందాగా సమాధానం ఇస్తూ ఉంటారు. మరి తెలుగు పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాలలో ఒకటైన మంచు కుటుంబం సోషల్ మీడియా చానల్స్ మీద పది కోట్లకు దావా వెయ్యాలి అని అనుకోవడం ( ఒకవేళ ఈ వార్త నిజం అయితే) ఎంతవరకు సమంజసం అన్న చర్చ నడుస్తోంది. అద్దాలమేడ అన్న సినిమాలో దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పినట్లు సినీ పరిశ్రమలో ఉన్న వారు అద్దాలమేడ వంటివారని బయటి నుంచి ఎవరైనా రాయి వేసినా, లోపల నుంచి తాము బయటి వారి పై రాయి వేసినా తమ అద్దాలమేడ నే పగిలిపోతుంది అన్న ఈ విషయాన్ని మంచు కుటుంబం ఎందుకు విస్మరిస్తోంది అన్న చర్చ కూడా నడుస్తోంది.
10 కోట్ల దావా వార్తపై కూడా ట్రోలింగ్
అయితే తాజాగా విడుదలైన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా దారుణంగా పరాజయం అయిందని, కొన్ని వందల థియేటర్లలో మొదటి షో తర్వాత మధ్యాహ్నం షో క్యాన్సిల్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు కనీసం సినిమాకు పెట్టిన ఖర్చు ఎంతో కొంత రాబట్టుకోవడానికి 10 కోట్ల కి సోషల్ మీడియా పై దావా వేస్తున్నారు అంటూ ఈ వార్తపై కూడా సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు కొందరు.
ఏది ఏమైనా ట్రోలింగ్ చేసేవారికి దిమ్మతిరిగేలా పెదరాయుడు వంటి సినిమా తో మోహన్ బాబు సమాధానం చెబుతారా లేకపోతే తమ స్థాయికి తగని విధంగా సోషల్ మీడియా లో పని చేసే చిన్న చితకా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.