చిరంజీవి, మోహన్ బాబు ఆదివారం సమావేశం కాబోతున్నారు. అయితే వారిద్దరి ముఖాముఖి కాదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సమావేశంలో పాల్గొనబోతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి చిరంజీవి, మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు ముఖ్యమైన నటీనటులు.. అలాగే ఇరవైనాలుగు క్రాఫ్ట్స్‌కు చెందిన ముఖ్యమైన వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశం ఎజెండా ఏమిటో స్పష్టతలేదు. చిరంజీవి బృందం సీఎం జగన్‌తో భేటీ అవడానికి ముందే ఇలాంటి సమావేశం ఒకటి పెట్టాలనుకున్నారు.
అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నారు. సినిమా రంగ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. అయితే మోహన్ బాబు, విష్ణు హాజరవుతూండటం ఇటీవలి కాలంలో వారు చేసిన వ్యాఖ్యల కారణంగా సమావేశంలో గందరగోళం ఏమైనా జరుగుతుందేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్‌తో జరిగిన భేటీ అంశాలను చిరంజీవి వివరించే అవకాశం ఉంది. అయితే ఆ సమయంలో తనను ఆహ్వానించారని.. తనకు ఆహ్వానం లేకుండా చేశారని వాదిస్తున్న మోహన్ బాబు ఎలా స్పందిస్తారదానిపై టాలీవుడ్ సమావేశం ఎలా జరగబోతుందనేది తేలే అవకాశం ఉంది.
ఇప్పటికే మోహన్ బాబు రగిలిపోతున్నారు. ఇద్దరు హీరోలు ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చివరికి ఈ సమావేశం ఎజెండా పై స్పష్టత లేకపోయినా… సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు అయి ఉంటుందని భావిస్తున్నారు. టిక్కెట్ ధరలు, స్పెషల్ షోల జీవోల కోసం టాలీవుడ్ ప్రస్తుతం ఎదురు చూస్తోంది.