ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేస్తుందో తెలియడం లేదు కానీ ఇంకా ఆ వ్యవహారం పేపర్లలో ఉండగానే ఆ జిల్లాలను చూపించి పన్నుల పెంపు కోసం ఏర్పాట్లు చేసేస్తున్నారు. కొత్త జిల్లాలు ఉగాది నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నందున ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు, ఆస్తుల విలువలు పెరిగాయని ప్రభుత్వం డిసైజయింది. ఇలా డిమాండ్ పెరిగిందనడానికి అనేక పద్దతుల్లో తెలుసుకున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విలువను భారీగా సవరించడానికిఅంచనాలు సిద్ధం చేసేసింది.
కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటి డోర్ నెంబర్లు, వాణిజ్య భవనాల నెంబర్ల కేటగిరీల వారీగా యుద్ద ప్రాతిపదికన నివేదికలు తయారవుతున్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఆయా పాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎంత వరకు పెంచాలనేదాని పై సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు దాదాపుగా రెడీ చేశారు. ఏడాదిగా భూముల వినియోగ మార్పిడి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగింది..?అనే దాని పై రెవెన్యూశాఖ, రహదారుల పక్కనున్న గ్రామాలు, పట్టణాల్లో సర్వే నెంబర్లు సేకరించి అక్కడ భూముల విలువలు ఎంత వరకు పెంచవచ్చనేది ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీని పై జాయింటు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఆమోదముద్ర వేయనుంది.
ప్రస్తుతం విలువ పై 25శాతం వరకు అదనంగా పెంచడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాత పద్దతులన్నీ తీసేసిన జగన్ సర్కార్ భూమికి ఉండే డిమాండ్ ఆధారంగా 10 నుంచి 40శాతం వరకూ విలువలు పెంచుతూ వెళ్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రజల పై రిజిష్ట్రేషన్ విలువను భారీగా పెంచి ఆదాయం కోసమే జిల్లాల విభజన చేస్తుందన్నట్లుగా పరిస్థితి మారిందన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.