తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న జగ్గారెడ్డి నిత్య అసమ్మతి వాదిగా మారి ఎటూ కాకుండా మిగిలిపోయినట్లుగా నిపిస్తోంది. జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.. విమర్శలు చేసి రాహుల్, సోనియాలకు లేఖ రాసినా టీ కాంగ్రెస్ నుంచి ఎవరూ పట్టించుకోలేదు. భట్టి విక్రమార్క మాత్రం ఆయనతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు కానీ ఎవరూ జగ్గారెడ్డిని కాంగ్రెస్‌లోనే ఉండాలని బలవంతపెట్టలేదు. దీంతో ఆయన మరింత హర్టయ్యారు. కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఆయన అనుకోవడం లేదు. అందుకే అటూ ఇటూ కాకుండా ఇక కాంగ్రెస్ గుంపులో ఉండనంటూ లేఖ పంపారు.
జగ్గారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీని పదే పదే అల్లరి చేయడం వెనుక ఎవరి వ్యూహం ఉందో.. తెలియదు కానీ.. ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్లుగా ప్రకటనలు చేస్తూండటం మాత్రం కాంగ్రెస్ వర్గాల్నే ఆశ్చర్య పరుస్తోంది. ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీ సారి పార్టీ మారిన చరిత్ర ఉంది. మొదట ఆయన బీజేపీ.. తర్వాత టీఆర్ఎస్ .. వైఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్ మళ్లీ బీజేపీ.. మళ్లీ కాంగ్రెస్ ఇలా ఆయన సైకిల్ చాలాపెద్దదే. ఆయనా కాంగ్రెస్ సంస్కృతి గురించి చెబుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో జరుగుతున్న రాజకీయంలో జగ్గారెడ్డి పావుగా మారారని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. జగ్గారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా ఇక ఆయనను పట్టించుకోకూడదన్న సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు దూరమైన ఆయనను ఏ పార్టీ కూడా దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదు. వెళ్తే మళ్లీ బీజేపీలోకి వెళ్లాలి ..కానీ అక్కడా ఆయన తీరును భరిస్తారా లేదా అన్నది డౌటే.