హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే ఒక్కొక్కరికీ 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకెళుతున్నారని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇవాళ కడపజిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ పట్టిసీమ, జెన్కో, అమరావతి భూముల వంటి చోట్ల చేసిన అవినీతి తాలూకు సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. నలుగురైదురు ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. వారు వెళ్ళిన నియోజకవర్గాలలో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారని చెప్పారు.
చంద్రబాబు నాడు ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు సిగ్గుంటే పార్టీలోకి ఇప్పుడు తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎన్నికలకు వెళదామని, ప్రజలు ఎవరివైపు నిలబడతారో చూద్దామని అన్నారు. చంద్రబాబు ఈ సవాల్‌ను ఛాలంజిగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని జగన్ అన్నారు. అప్పుడు నైతికంగా వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళతామని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనటం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని అన్నారు. దేవుడు, ప్రజలు తమవైపు ఉన్నారని జగన్ చెప్పారు.