” మీ దగ్గరకు వచ్చి అయ్యా.. పరిష్కరించండి అని దండాలు పెడితేనే సమస్యలు పరిష్కరిస్తారా? ఇదేమైనా రాచరికమా? ప్రజాస్వామ్య సమాజంలో ఫ్యూడల్ భావాలు ఉంటే ఎలా? మీ పనులతో సహనం భరిస్తున్నాం… భయంతో కాదు..” అని జనసేన అధినతే పవన్ కల్యాణ్ నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో విరుచుకుపడ్డారు. జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 217 జీవోను చించిపారేసే వాళ్లం. నష్టాలు కలిగిస్తుంటే చట్టాలు ఉల్లంఘించాలి. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని పిలుపునిచ్చారు.
చెరువులపై మత్స్యకారులకు హక్కులు తొలగించేలా 217 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవోకు వ్యతిరేకంగానే పవన్ కల్యాణ్ మత్స్యకార అభున్నతి సభ నిర్వహించారు. తాను స్వయంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలు చించేశా.. అవసరమైతే కేసులు పెట్టుకోండని సవాల్ చేశారు. లేని సమస్యలు సృష్టించి పరిష్కరిస్తున్నట్లుగా నటించండంలో వైసీపీ నేతలు ఉద్దండులని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో 65 నుంచి 70లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. లక్షల మంది పొట్టకొట్టే విధంగా జీవో 217 తీసుకొచ్చారని మండిపడ్డారు.
జీవో 217కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేసే పోరాటానికి అండగా ఉంటాని.. మీకోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జీవో కాపీ చించడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. కేసులు పెడతారని తెలిసినా భయపడనని ప్రకటించారు. ఆన్లైన్లో చెరువుల వేలం పాటలు నిర్వహిస్తే ఎవరూ పాడొద్దు… నష్టపోతారు. జనసేన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం నుంచి నరసాపురం వస్తుంటే… దారి పొడవునా గోతులేనని విమర్శించారు. పడవ ప్రయాణంలా రోడ్లపై ఊగుతూ వస్తుంటే.. మాయాబజార్లో లాహిరి లాహిరి పాట గుర్తొచ్చిందన్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో మళ్లీ కలుద్దామన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో నిర్ణయించుకుందామన్నారు.