24 క్రాఫ్ట్స్‌లో రైటింగ్ అనేది చాలా కీలకమైన, అతి ముఖ్యమైన విభాగం. సినిమాకి నిర్మాత ఎంత ముఖ్యమో.. ఆ సినిమా తయారవ్వడానికి కథ కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు అది ప్రత్యేకమైన క్రాఫ్ట్‌గా పరిగణించేవారు. కథ వేరు. స్క్రీన్ ప్లే వేరు, మాటలు వేరు. ఒకొక్క విభాగానికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. వాళ్లంతా కలిసి వండితేనే సినిమా తయారవుతుంది. అయితే రాను రాను… రచయిత కనుమరుగైపోయాడు. దర్శకుడే అన్నీ రాసేసుకోవడం, చేసేసుకోవడం వల్ల… రచయితలు బాగా వెనుకబడ్డారు.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – అనే కార్డు వాల్యూ పెరగడం వలనో, అలా వేసుకుంటే తప్ప దర్శకులకు గుర్తింపు రాదన్న అభద్రతా భావం వలనో… ఘోస్ట్ రైటర్లను పెట్టుకుని మరీ, ఆయా విభాగాల్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు దర్శకులు. రచయితలు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికో, లేదంటే.. తమకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకో దర్శకులుగా అవతారం ఎత్తారు. దాంతో.. దర్శకత్వంలోనే రైటింగ్ కలిసిపోయింది. రచయితల విభాగానికంటూ ఓ గుర్తింపు లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి బాగా మారింది. కొంతకాలంగా రైటర్లకు అగ్రతాంబూలం అందుతోంది. కథ వేరు, స్క్రీన్ ప్లే వేరు, సంభాషణలు వేరు.. అంటూ దర్శకులు కూడా ఆయా విభాగాల్ని వేరొకరికి అప్పగించి, తమ పని భారాన్ని తగ్గించుకుంటున్నారు. రైటర్లకు భారీ పారితోషికాలు అందుతున్నాయి. అప్పట్లో త్రివిక్రమ్ సంభాషణలకు కోటి అందుకున్నారని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ కోటి.. కామన్ అయిపోయింది.
టాలీవుడ్లో కోటి అందుకుంటున్న రచయితలు చాలామందే ఉన్నారు. బుర్రా సాయిమాధవ్.. అత్యంత ఖరీదైన మాటల రచయితగా మారారు. పెద్ద సినిమా అనగానే డైలాగ్ రైటర్‌గా ఆయన పేరే ముందు చర్చల్లోకి వస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా శంకర్ – చరణ్ సినిమా కూడా ఆయన చేతిలోనే ఉంది. ప్రాజెక్ట్ – కెకి ఆయనే రచయిత. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాకీ మాటలు అందిస్తున్నారు. బుర్రా పారితోషికం ఇంచుమించుగా కోటి రూపాయలు.
లక్ష్మీ భూపాల కూడా రచయితగా తనదంటూ ఓ మార్కెట్ సృష్టించుకున్నారు. సంభాషణలు రాయడంతో పాటు, పాటలు అందించడం భూపాల ప్రత్యేకత. `నేనే రాజు నేనే మంత్రి` తరవాత కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. చిరంజీవి `గాడ్ ఫాదర్` చిత్రానికి ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. భూపాల బడా సినిమాలకే పరిమితం కాలేదు. కథ నచ్చితే, చిన్న సినిమాలకూ ఆయన మాట సాయం అందిస్తున్నారు. మార్కెట్ లో ఉన్న బిజీ రైటర్లలో భూపాల ఒకరిప్పుడు.
పుష్పతో వెలుగులోకి వచ్చిన మరో రచయిత శ్రీకాంత్ విస్సా. ఇటీవల ఖిలాడీకీ ఆయన సంభాషణలు అందించారు. శ్రీకాంత్ విస్సా పనితనం నచ్చి, తన రాబోయే మూడు సినిమాల్లోనూ తననే రైటర్‌గా తీసుకున్నారు రవితేజ. అలా… శ్రీకాంత్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అబ్బూరి రవి లాంటి రైటర్లకు ఎప్పుడూ డిమాండే. ఆయన ఆచి తూచి కథల్ని ఎంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ కూడా బిజియెస్ట్ రైటర్‌గా మారిపోయారు. త్రినాథరావు నక్కిన తో ఆయనది సూపర్ హిట్ కాంబో. ఇద్దరూ కలిసే సినిమాలు చేస్తున్నారు. అప్పట్లో విజయభాస్కర్ – త్రివిక్రమ్ లా అన్నమాట. రివ్యూ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్ రావూరి `వరుడు కావలెను`తో సంభాషణ రచయితగా మారారు. ఆయనకంటూ తొలి సినిమా ఓ గుర్తింపు తీసుకొచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో రెండు సినిమాలకు పనిచేస్తున్నారాయన.
కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఉద్దండుడు వక్కంతం వంశీ. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్లు ఉన్నాయి ఆయన ఖాతాలో. వక్కంతం కథ అందిస్తే.. కనీసం కోటి నుంచి రెండు కోట్ల పారితోషికం ముడుతుంది. ఆయన రాసేవన్నీ కమర్షియల్ కథలే కాబట్టి, వాటికి మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి… వక్కంతం అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ. ప్రస్తుతం సురేందర్ రెడ్డి `ఏజెంట్` చిత్రానికి ఆయన కథ అందించారు.
రచయితలకు ఇప్పుడు స్వర్ణయుగం నడుస్తోంది. దానికి రెండు కారణాలు. ఒకటి.. సినిమాల ప్రొడక్షన్ బాగా పెరిగింది. యేడాదికి 150 సినిమాలు తయారవుతున్నాయి. దాంతో కథలు, రచయితల అవసరం ఏర్పడింది. దానికి తోడు ఓటీటీ వ్యవస్థ విస్తరించింది. వెబ్ మూవీలు, వెబ్ సిరీస్‌ల ప్రాధాన్యం పెరిగింది. ఏ ప్రాజెక్టు సెట్‌పైకి వెళ్లాలన్నా కథ కావాలి. కథ కావాలంటే రచయిత ఉండాలి. అందుకే రైటర్స్‌కి ఇంత డిమాండ్ ఏర్పడింది.