తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లి శివసేన, ఎన్సీపీ అధినేతలతో చర్చలు జరిపి హైదరాబాద్ వచ్చిన గంటల్లోనే కీలకమైన ప్రకటన ముంబై నుంచి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎలాంటి కూటమి ఏర్పాటుకు చర్చలు జరిపేది లేదని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. కేసీఆర్తో జరిగిన చర్చల్లో శివసేన తరపున ఈయన కూడా పాల్గొన్నారు. శివసేన తరపున ప్రకటనలన్నీ రౌతే చేస్తూంటారు. కూటమి గురించి తృణమూల్ కాంగ్రెస్ కూడా మాట్లాడుతోంది కానీ.. కాంగ్రెస్తో పాటే బీజేపీపై పోరాటానికి వెళ్లాలన్నది తమ సిద్దాంతమని శివసేన స్పష్టం చేసింది.
కాంగ్రెస్ను కూటమిలో కలుపుకుని వెళ్లాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకుని వెళ్లగల సామర్థ్యం కేసీఆర్కు ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత మందితో కుదిరితే.. అంత మందితో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ఉంటున్న పార్టీలతో సమావేశమవుతున్నారు. కానీ ఆయనకు ఎక్కడా సానుకూల సంకేతాలు రావడం లేదు. స్టాలిన్ కూడా కాంగ్రెస్ను వదిలి పెట్టి వేరే కూటమిలో చేరే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.
అప్పుడు కూడా కేసీఆర్ పర్యటన ముగిసిన ఒక్క రోజులోనే ఈ ప్రకటన వచ్చింది. ఇప్పుడు శివసేన కూడా అలాంటి ప్రకటనే చేసింది. అయితే మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ లేని కూటమిన ిఏర్పాటు చేసి నాయకత్వం వహించాలన్న లక్ష్యంతో ఉన్నారు. కేసీఆర్ ది కూడా అదే వ్యూహం. మరి ఇలా అయితే ప్రాంతీయ పార్టీల సమావేశం జరుగుతుందా ? అంటే చెప్పడం కష్టమే అనుకోవచ్చు.