” భారతీయులు అమెరికా పోయి చదువుకుంటున్నారు.. కానీ అమెరికన్లే భారత్ కు వచ్చి చదవుకోవాలి.., రూపాయికి డెభ్భై డాలర్లు వచ్చే పరిస్థితి రావాలి.. అమెరికా కన్నా ఇండియానే ధనిక దేశం “.. ఇలాంటి కబుర్లు 2014కి ముందు నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కుప్పలు తెప్పలుగా వాట్సాప్‌లలో వచ్చి పడ్డాయి. బీజేపీ నేతలు అదే చెప్పారు. ఇండియన్ల చాతి యాభై ఆరు అంగుళాలు పెంచేవారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటే అదేనని చెప్పేవారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అప్పటి ఆ డైలాగుల్ని అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఇదే డైలాగుల్ని వినిపించడం ప్రారంభించారు.
ముంబై పర్యటన నుంచి వచ్చిన వెంటనే నారాయణఖేడ్ జిల్లాలో రెండు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన ఆయన అక్కడ ప్రసంగిస్తూ బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా బంగారుం చేసుకుందామని పిలుపునిచ్చారు. తాను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నాని ఢిల్లీ దాక కొట్లాడుదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా…? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేయాలన్నారు. మనం అమెరికా పోవడం కాదు.. ఇతర దేశాలే వీసాలు తీసుకొని మన దేశానికి వచ్చే పరిస్థితి చేసేంత గొప్ప సంపద, వనరులు, యువశక్తి ఈ దేశంలో ఉందని అందుకే పోరాటానికి బయలుదేరానన్నారు.
తెలంగాణలో పథకాలపై మహారాష్ట్ర సీఎం కూడా అడిగారని.. అందుకే.. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతోంది. దేశం గురించి మనం కూడా కొట్లాడాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయానని కేసీఆర్ ప్రజలకు చెబుతున్నారు. కానీ ఆయన సమావేశమైన వారు మాత్రం .. కూటమి గురించిన భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.