తనపై రగిలిపోతున్న జగ్గారెడ్డి, వీహెచ్‌ల విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వారి తీరుపై తనకు ఏ మాత్రం అసంతృప్తి లేనట్లుగా.. వారు తన విషయంలో చేస్తున్న విమర్శలు తనపై కానట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల నుంచి జగ్గారెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మేడారంలో ఈ అంశంపై మాట్లాడిన రేవంత్ .. తమ కుటుంబ సభ్యమ అని టీ కప్పులో తుపానులా తేలిపోతుందన్నారు. ఆ తర్వాత కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా మరోసారి జగ్గారెడ్డి అంశంపై స్పందించారు. జగ్గారెడ్డి, వీహెచ్ కోవర్టులంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం విషయంలో వారికి అండగా ఉంటామన్నారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీలోని వివాదం కుటుంబసభ్యుల మధ్య పంచాయతీ లాంటిదని సమసిపోతుందన్నారు. గతంలో వారిపై సోషల్ మడియా పోస్టులు పెట్టిన వారు కౌశిక్ రెడ్డి అనుచరులని తేలిందన్నారు. నిజానికి ఈ పోస్టులు పెడుతోందని రేవంత్ సైన్యం అని జగ్గారెడ్డి, వీహెచ్ ఆరోపిస్తున్నారు.
జగ్గారెడ్డి, వీహెచ్‌తో తమ పార్టీ పెద్దలు చర్చిస్తున్నారని రేవంత్ చెబుతున్నారు. వివాదం సద్దు మణిగిపోతుందని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా అందర్నీ కలుపుకుని పోతున్నానని ఎంత చిరాకు పెట్టినా తాను విమర్శలు చేయడం లేదని.. చివరికి హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేయడం లేదని ఆయన అందరికీ తెలిసేలా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరాడుతూంటే .. ఆయనకు చికాకులు కల్పించేందుకు జగ్గారెడ్డి, వీహెచ్ ప్రయత్నిస్తున్నారన్న ఓ భావన మాత్రం అందరిలోనూ ఏర్పడుతోంది.