ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రపంచం యావత్తూ తలెత్తి చూసేంత సమున్నతంగా అత్యద్భుతంగా నిర్మిస్తానంటూ చంద్రబాబునాయుడు మాటల్లో కోటలు దాటిపోతున్న ఈ నవ్య రాజధానికి ఒక అపురూపమైన హోదా ఉంది. ఈ దేశంలో రైలు మార్గం కనెక్టివిటీ లేని.. రాష్ట్ర రాజధాని ఇదొక్కటే. బహుశా కొత్త స్థలాన్ని రాజధానికోసం ఎంపిక చేయడం వలన ఇలాంటి దౌర్భాగ్యమైన దురవస్థ మనకు సంప్రాప్తించిందని అనుకోవచ్చు. కానీ.. ఈ రైల్వేబడ్జెట్తో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఆ దిక్కుమాలిన హోదా తొలగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సురేశ్ ప్రభు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతానికి అమరావతి నగరానికి ఆ హోదాను శాశ్వతమేచేశారు. అమరాతి మీదుగా రైలు మార్గం గురించి గానీ.. అక్కడ రైల్వే స్టేషను నిర్మాణం గురించి గానీ.. కనీసం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏపీ రాజధానికి తాము ఏమైనా చేయబోతున్నట్లుగానీ ఆయన ఏమాత్రం ప్రకటించలేదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా అమరావతిని అనుకున్న తర్వాత.. చంద్రబాబునాయుడు ఆ నగరాన్ని ఎలా తీర్చిదిద్ద బోతున్నారరో చాలా ప్రకటించారు. అవన్నీ అప్రస్తుతం అయినా.. రైల్వే పరంగా ఆయన ప్రకటించిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. గుంటూరు- విజయవాడలను అమరావతి మీదుగా కలుపుతూ కొత్త రైలు మార్గాలు వస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రాజధానితో రైలు మార్గం కనెక్టివిటీ ఉంటుందన్నారు. ప్రస్తుతం రాయలసీమకు అమరావతికి వెళ్లడానికి కనీస రైలు వసతి కూడా లేదు. కొత్త మార్గాలు వస్తాయని సెలవిచ్చారు. ఇప్పటికిప్పుడు కొత్త రైళ్లు గట్రా కుదరవు గనుక.. తక్షణం విజయవాడనుంచి అమరావతి కి ‘మెము’ రైళ్లు నడిపేస్తాం అంటూ వెల్లడించారు. అమరాతికి మెట్రో రైలు లాంటి అదనపు హామీలు కూడా ఉన్నాయి.
అయితే కనీసంగా అమరావతిని చేరుకోవడానికి గుంటూరుజిల్లాలోని నంబూరు రైల్వేస్టేషన్నుంచి రైలు మార్గం తక్షణం వేయించడం గురించి గతంలో రైల్వే జనరల్ మేనేజర్ హామీలు కూడా ఇచ్చారు. ఇంతకంటె ఘోరం ఏంటంటే.. అమరావతికి రైల్వే పరంగా కావాల్సిన అవసరాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంనుంచి కేంద్రానికి వినతులు సమర్పిస్తూనే ఉంది. ఈ విషయంపై రైల్వే మంత్రి, బోర్డు ఛైర్మన్లకు సీఎస్ కృష్ణారావు అప్పట్లోనే లేఖలు రాశారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన నాటినుంచి చంద్రబాబునాయుడు కూడా ప్రధాని నరేంద్రమోడీకి విన్నవిస్తూనే ఉన్నారు. కానీ తాజా రైల్వేబడ్జెట్‌లో అమరావతికి దక్కింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి.
బడ్జెట్లో ప్రకటించే ప్రాజెక్టులే కార్యరూపం దాల్చి కొలిక్కి వచ్చేసరికి ఏళ్లూ పూళ్లూ గడచిపోతున్నాయి. మరి బడ్జెట్లో పూర్తిగా విస్మరించిన అమరావతి నగరం.. రైల్వే సదుపాయాలకు నోచుకోవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో లేదా మధ్యలో చంద్రబాబునాయుడు తన చాతుర్యాన్ని ఏ మేరకు అయినా ప్రదర్శిస్తారో చూడాలి.