వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పులివెందుల కోర్టులో మరోసారి వాంగ్మూలం ఇచ్చారు. అప్రూవర్‌గా మారేందుకు హైకోర్టు కూడా అంగీకారం తెలుపడంతో సీబీఐ అధికారులు కొత్తగా వాంగ్మూలం నమోదు చేశారు. గతేడాది ఆగస్ట్ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అందులో సంచలన విషయాలు ఉన్నాయి. ఆ వాంగ్మూలం ఆధారంగానే అవినాష్ రెడ్డిని ప్రధాన అనుమానితుడిగా సీబీఐ అనుమానిస్తోంది. అయితే అప్పటికి అప్రూవర్‌గా మారలేదు. తర్వాత పరిణామాలతో అప్రూవర్‌గా మారడంతో క్షమాభిక్ష ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పుడు రెండో సారి దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కీలకమయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో గతంలో చెప్పినట్లుగా చెప్పాడా లేదా అన్నదానిపైనే కేసు ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అంతకు ముందు ఓ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐ డీఐజీ కూడా కపులివెందులకు వచ్చారు.
సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తూండటంతో విచారణ అధికారులపైనా కొంత మంది ఆరోపణలు చేస్తూ పోలీసుల్ని కలుస్తున్నారు. గతంలో అనంతపురం, కడప ఎస్పీల్ని కలిసి సీబీఐ అధికారులు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గత వారం మరో అనుమానితుడు కడప ఏఎస్పీని కలిసి అదే రకమైన ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ సీబీఐ మాత్రం దూకుడుగా విచారణ జరుపుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బట్టి పోలీసులు తీసుకునే చర్యలపై ఇప్పుడు అంతటా ఆసక్తి ఏర్పడింది.