తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం, బీజేపీతో పోరాటం ప్రారంభించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా అని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉన్నా తెలంగాణలో గవర్నర్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడీ వివాదం కేంద్రం దృష్టికి కూడా వెళ్లింది. గవర్నర్ను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడంలేదు. ఇటీవల గణతంత్ర వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించకపోగా .. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు.
తాజాగా గవర్నర్ మేడారం పర్యటన సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరింత వివాదానికి కారణం అవుతోంది. గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉంది. కానీ వారు హాజరు కాలేదు. చివరికి మేడారం ముగింపు రోజు గవర్నర్ మేడారం వెళ్తారని, హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరినా పట్టించుకోలేదు. చివరికి గవర్నర్ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లారు.
గవర్నర్ మేడారం చేరడానికి ముందే మంత్రులు అధికారులు ప్రెస్మీట్ నిర్వహించారు. తర్వాత గవర్నర్ వస్తున్నారని తెలిసినా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చివరికి గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. మావోయిస్టు ప్రభావ ప్రాంతంలో గవ ర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై కేంద్రం విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తరచూ ఎదురవవుతున్నాయి.