తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రపతిగా వెళ్తారా ? ఆయన కాకపోతే నితీష్ కుమార్ వెళ్తారా? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నాయని … తమలో బలమైన నేతను పదవికి నిలబెడితే మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ కూడారెడీగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ బలమైన నేతలు ఎవరు అంటే.. ఒకరు కేసీఆర్.. రెండు నితీష్ కుమార్.
వీరిద్దరిపైనే ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారట. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమని కేసీఆర్ ప్రకటించారు. అయితే రాష్ట్రపతిగా వెళ్లడం అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కాదు.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటిదే. అయితే రాష్ట్రపతిగా గెలుస్తామన్నంత బలం ఉండి.. తనను అభ్యర్థిగాఅందరూ అంగీకరిస్తే ఆయన అంగీకరించే అవకాశం ఉంది. మరో వైపు నితీష్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. ఆయన కూడా సిద్దమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీని నమ్ముకుని ఎంత కాలం అధికారంలో ఉంటామో ఆయనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చూస్తున్నారని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఝులక్ ఇచ్చి… ఆ ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బకొట్టాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే ఓ విధంగా రాష్ట్రపతిగా కేసీఆర్ లేదా నితీష్ అనేది ఆకర్షణీయంగా ఉన్నా.. కాస్త ఆలోచిస్తే అసాధ్యమని కొంత మంది విశ్లేషిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అర్థం చేసుకోవచ్చు.