వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడుగా విచారణ జరుపుతున్న సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కడప రిమ్స్‌లో పోలీసు కేసు నమోదయింది. తక్షణం అరెస్ట్ చేయగల సీరియస్ సెక్షన్లతో కేసు పెట్టారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని కొంత మందికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్ రెడ్డి ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కేంద్ర దర్యాప్త సంస్థకు చెందిన అధికారి అదీ కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. కొంత కాలంగా వ్యూహాత్మకంగా కొంత మంది సీబీఐ పై ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.
గత నవంబర్ 29న వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీన వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హానీ ఉందని వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించారు. ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందులలో ఉన్న యూరేనియం ఫ్యాక్టరీ ఉద్యోగి. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితునిగా పేరు ఉంది. గతంలో ఓ సారి ఆయనను సీబీఐ పిలిచి విచారణ జరిపింది. అప్పట్లో ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇటీవల మరోసారి పిలిచి ప్రశ్నించింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీబీఐ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యాధృచ్చికంగా డీజీపీ మారిన తర్వాత సీబీఐపై పోలీసులు కేసులు పెట్టడం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది . దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.