నితిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాతో ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరిగింది. ఇదో పొలిటికల్ డ్రామా అనే సంగతి టైటిల్ తో తెలుస్తూనే ఉంది. ఇందులో స్ట్రాంగ్ పొలిటికల్ పాయింట్లు చర్చించార్ట. ఈ కథలో ‘రంగస్థలం’ లక్షణాలు కనిపిస్తాయని తెలుస్తోంది.
రంగస్థలం పొలిటికల్ డ్రామానే. ఓ ఊర్లో… ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే ప్రెసిడెంట్.. తనని ఓడించాలని రంగంలోకి దిగిన ఓ యువకుడు.. ఇక్కడ్నుంచి కథ మొదలవుతుంది. ఆ తరవాత… రంగస్థలం రివైంజ్ డ్రామాగా మారిపోయింది. ‘మాచర్ల…’లోనూ ఇలాంటి పాయింట్ ఉందట. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నిక ఎప్పుడూ ఏకగ్రీవంగానే జరుగుతుంటుందని, అక్కడ పోటీకి ఎవరు నిలబడినా, విలన్ ఏదోలా అడ్డు తొలగించుకుంటాడని, అలాంటి చోట.. ఎన్నికలు జరిగితే, ఆ ఎన్నికలలో, విలన్ ని ఎదిరించడానికి హీరో వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి.. ‘మాచర్ల నియోజక వర్గం’ కథ పుట్టిందని తెలుస్తోంది. నితిన్ క్యారెక్టరైజేషన్, తన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఈ సినిమాలో సరికొత్తగా చూబోతున్నారని తెలుస్తోంది. ఎప్పుడూ లవ్ స్టోరీలు, మాస్ కథలతో ప్రయాణం చేసే నితిన్… పొలిటికల్ డ్రామాలో కనిపించడం కొత్తగానే ఉంటుంది మరి.