హైదరాబాద్: దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు తన ప్రతిభను పదిమందికీ ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నారు. దర్శకులు కావాలనుకునేవారు, దర్శకత్వం గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం ‘కేఆర్ఆర్ క్లాస్ రూమ్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో పాఠాలు చెప్పబోతున్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఎకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. కేఆర్ఆర్ క్లాస్ రూమ్‌కు ‘ప్రాక్టికాలిటీ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. క్లాసులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, చూస్తూ ఉండాలని పేర్కొన్నారు.
సినిమా కార్యక్రమాలలో, సభలలో వేదికపై ఎక్కడా నోరు విప్పని రాఘవేంద్రరావు, ఆ మధ్య ‘ఈటీవీ తెలుగు’లో ప్రసారమైన ‘సౌందర్యలహరి’ అనే కార్యక్రమం ద్వారా తన అనుభవాలను వెల్లడించటంతోపాటు, తెరవెనుక తాను చేసిన కృషిని కూడా వివరించారు. ఆ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది… చిత్రపరిశ్రమలోనివారందరూ జేజేలు పలికారు. ముందు తరాలవారికి ఇది బాగా సాయపడుతుందని ప్రశంసించారు. ఆ స్ఫూర్తితోనే దర్శకేంద్రుడు ఈ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి పూనుకున్నట్లు కనబడుతోంది.