ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కేంద్ర బడ్జెట్ గొప్ప… ఏపీ బడ్జెట్ దిబ్బ అనే రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్‌పైనే తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో .. వారు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏపీలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర విమర్శించారు. ఒక్క క్లిక్ నొక్కి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్‌ను చూడాలని.. ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే.. ఏపీ బడ్జెట్‌ను చూడాలన్నారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో రూ. 37 వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని కానీ ఇప్పటికే రూ. 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్ నొక్కి పంచేశారని విమర్శించారు.
ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లు బాగుపడినట్లు ఎక్కడా లేదని అది వ్యక్తి అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఇదే జరుగుతుందని తేల్చి చెప్పారు. జగన్ తన సొంత డబ్బు తెచ్చి పంచడం లేదని భారం మొత్తం ఏపీ ప్రజలు మోయాల్సిందేనన్నారు. అదే సమావేశంలో జీవీఎల్, సోము వీర్రాజు తాము ఎప్పుడూ చెప్పేదే చెప్పారు. అయితే వీరంతా ప్రో వైసీపీ లీడర్స్‌గా గుర్తింపు పొందారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు చేసిన రచ్చ ఇంకా కళ్ల ముందు కనిపిస్తూ ఉండటంతో వీరి వ్యాఖ్యలు .., విమర్శలకు విలువ లేకుండా పోతోంది.
నిజానికి ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను తీసి పక్కన పడేసి ఇష్టారీతిన ఖర్చులుచేస్తోందని స్వయంగా కాగ్ అక్షింతలు వేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో జీవీఎల్ నరసింహారావు ఎక్కువగా ఏపీలోనే ఉంటూ బీజేపీని మెరుగుపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జులు కూడా పెద్దగాఏపీ వైపు రావడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సునీల్ ధియోధర్పై సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేయడంతో ఆయన కూడా రావడం తగ్గించుకున్నారు.