తెలంగాణలో టీఆర్ఎస్ కోసం వ్యూహాలు పన్నుతూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే స్ట్రాటజీలను ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో టీఆర్ఎస్ అమలు చేస్తోందని కాంగ్రెస్ నమ్ముతోంది. జగ్గారెడ్డి ఆ ట్రాప్‌లో పడ్డారని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ పీకే వ్యూహాలను తిప్పి కొట్టడానికి ఓ వ్యూహకర్తను సిద్ధం చేసింది. తెలంగాణకు కూడా ఇలా ఓ వ్యూహకర్తను ఎలాట్ చేసింది. ఆయన పేరు సునీల్ కణుగోలు.
తమిళనాడులో అన్నాడీఎంకే .. పరువు కాపాడటంలో సునీల్ కణుగోలు కీలకంగా వ్యవహరించారు. అన్నాడీఎంకే ఘోరపరాజయం పాలవుతుందని అందరూ అంచనా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనూహ్యంగా గట్టిపోటీ ఇచ్చారు. దానికి కారణం స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్న సునీల్ కణుగోలు సలహాలేనని ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీల్ తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ కోసం పని చేయాలని ఒప్పందం చేసుకున్నారు.
సునీల్ ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఐప్యాక్‌లో పని చేశారు. చాలా కాలం పని చేసిన తర్వాత సొంత బాట పట్టారు. టీఆర్ఎస్పై రేవంత్ వర్గం దూకుడు పెంచింది. సునీల్ కొత్త వ్యూహాలతో తెలంగాణలో రెండు పార్టీల మధ్యే పోరు ఉందని..అది కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్యనే అన్న భావన తేవాలని ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కాంగ్రెస్ కలహాల్లోనే కాలం వెళ్లదీస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్యతో పాటు పార్టీ ఎలా వ్యవహరించాలనే అంశంపై సునీల్ సూచనలు కీలకమయ్యే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.