” రెండు మదగజాలు పోట్లాడుకుంటూంటే వాటి మధ్యకు పోకూడదు…” వెళ్తే ఏమవుతుంది ? నలిగిపోతుంది. చివరికి ఆ రెండు మద గజాలు తమకేమీ నష్టం లేకుండా తగిలీ తగలనట్లు.. వినపడీ వినపడనట్లు దూరంగా ఉండి గాండ్రించుకుంటూ ఉంటాయి.. కానీ మధ్యలో ఇరుక్కున్న వారు మాత్రం నలిగి నాశనమైపోతారు. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఇదే. అమెరికాతో పాటు అగ్రదేశాలు అండగా ఉంటాయని వాటితో స్నేహం పెంచుకుని.. పొరుగున ఉన్న రష్యాతో వైరం పెంచుకుని ఇప్పుడు ఆ ఆగ్రదేశాల వల్లే దాడులకు గురవుతోంది. కానీ ఆ అగ్రదేశాలు మాత్రం సాయానికి ముందుకు రావడం లేదు. అందరూ కలిసి రష్యాను నియంత్రించాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. కానీ అగ్రదేశాలు కారణాలు వెదుక్కుంటున్నాయి.
ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న పుతిన్ !
ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ విమానాల రొద వినిపిస్తోంది. రాజదాని నగరం కీవ్ బిక్కు బిక్కు మంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్నాళ్లుగా “శాంతి స్థాపన” దళాలను సరిహద్దుల్లో మోహరింపచేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఓ నైట్ దాడులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఉన్ న శాంతి ఒప్పందాన్ని పక్కన పడేసి, తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారుల అధీనంలోని రెండు ప్రాంతాల నుంచి సైన్యాన్ని రంగంలోకి దింపారు. లక్షన్నర మంది సైనికులతో యుద్ధం ప్రారంభించారు. ఉక్రెయిన్‌కు తూర్పున ఉన్న రెండు ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ 2014లోనే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. 0 రెండు ప్రాంతాలూ రష్యా అండ కలిగిన తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నాయి. యుద్ధం ప్రారంభించే ముందు వాటిని స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించారు. అంతకు ముందే ఉక్రెయిన్‌కు దక్షిణంగా ఉన్న క్రిమియాను రష్యా తమలో విలీనం చేసుకుంది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది.
ఉక్రెయిన్ చేసిన పాపం ఏమిటి ?
ఉక్రెయిన్ చేసిన పాపం అమెరికా, యూరప్ దేశాలతో సన్నిహితంగా ఉండటం. ఉక్రెయిన్ యూరప్ సంస్థలైన నాటో, ఈయూల వైపు ఉంది. దీన్ని రష్యా మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్ ఎప్పుడూ పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగానే ఉందని, అది ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేనే లేదని పుతిన్ వాదిస్తున్నారు. 30 దేశాల కూటమి అయిన నాటోలో ఉక్రెయిన్ చేరదని అగ్రరాజ్యాలు తనకు హామీ ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా అలాంటి హామీ ఇవ్వలేదు. ఉక్రెయిన్ అటు రష్యాతోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోనూ సరిహద్దును పంచుకుంటోంది. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఉక్రెయిన్‌కు రష్యా సామాజిక, సాంస్కృతిక జీవనంతో దగ్గరి అనుబంధం ఉంది. ఆ దేశంలో రష్యన్ భాషను మాట్లాడే వాళ్లు అత్యధికంగా ఉంటారు. అయితే, 2014లో రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో రష్యా ఏమైనా దూకుడుగా ఉంటే … తమను పాశ్చ్యాత్య దేశాలు ఆదుకుంటాయని ఉక్రెయిన్ ధైర్యంతో ఉంటూ వస్తోంది. కానీ అలాంటి అవకాశమే లేదని యుద్ధం ప్రారంభమైన తర్వాత వెల్లడయింది.
రష్యాపై దాడికి నాటో వెనుకడుగు !
ఉక్రెయిన్ అల్లకల్లోలం అవుతున్నా ఆ దేశానికి ఈ దుస్థితి రావడానికి కారణమైన నాటో, యూరప్ దేశాలు దేశాలు ఇప్పటికే యుక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశాలేవీ తమకు లేవని ప్రకటించాయి. అయితే కొంత సాయం మాత్రం చేస్తామని చెబుతున్నాయి నాటో దేశాలు యుక్రెయిన్‌కు సలహాదారులు పంపించడం, ఆయుధాలు ఇవ్వడం, ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయడం వంటి సహాయాలు అందించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ రష్యాపై ఎదురుదాడి చేయడానికి మాత్రం తమ సాయం చేయడం లేదు. రష్యాపై దాడి చేసే ఉద్దేశం లేదని నాటో దేశాలు ప్రకటించేశాయి. దీంతో ఉక్రెయిన్ కు యుద్ధంలో అవుతున్న గాయాలకు ఆయింట్మెంట్ మాత్రం పశ్చిమదేశాలు పూస్తాయి కానీ.. గాయాలు కాకుండా రష్యాను ఆపే ప్రయత్నం కానీ..ఎదురు దెబ్బతీసే ప్రయత్నం కానీ చేయవు. అంటే.. రష్యా జోలికి పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నమాట.
రష్యాకు ఏం కావాలి ?
ఉక్రెయిన్‌పై తిరుగుబాటుచేసి.. ఆ దేశాన్ని తమలో కలుపుకునే ఉద్దేశం లేదని రష్యా చెబుతోంది. కానీ పుతిన్ ఇటీవల పలుమార్లు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. సోవియట్ యూనియన్ 1991లో ముక్కలు కావడాన్ని పుతిన్ “చరిత్రాత్మక రష్యా విచ్ఛిన్నం”గా భావిస్తున్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా కమ్యూనిస్టు రష్యా ఏర్పాటు చేసిందేనని ఆయన చెబుతున్నారు. అయితే తాము ఉక్రెయిన్ను కలిపేసుకుంటామని మాత్రం ఆయన చెప్పడం లేదు. మూడు డిమాండ్లను ఆయన పెట్టారు. వాటిలో మొదటిది ఉక్రెయిన్ ఎన్నటికీ నాటో సభ్య దేశం కాకూడదు. ఉక్రెయిన్ కనుక నాటోలో రష్యాకు వ్యతిరేకంగా వారంతా ఏకమవుతారని.. మళ్లీ క్రిమియాను లాక్కునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందని అనుమానిస్తున్నారు. రష్యా సరిహద్దు ప్రాంతాల్లో నాటో సాయుధ దళాలను మోహరించకపోవడం కూడా మరో షరతులు. రష్యాతో సరిహద్దులు ఉన్న దేశాల్లో నాటో దళాలు ఉండకూడదు అంటే.. మధ్య యూరప్, తూర్పు యూరప్, బాల్టిక్స్‌లో నాటో ఉండకూడదు. దీనికి యూరప్ దేశాలు ఎందుకు అంగీకరిస్తాయి. నాటో దేశాలు కలిస్తే శక్తివంతమైన సైనిక కూటమి. అందులో ఉక్రెయిన్ కలిస్తే రష్యాకు ఎప్పటికైనా ముప్పేనని పుతిన్ నమ్ముతున్నారు.
రష్యాను దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్ను పావుగా వాడుకుటున్న నాటో !
నాటో దాదాపు 30 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అది 30 సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అన్ని దేశాలు ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతాయి. సోవియట్ పతనం తర్వాత ఏర్పడిన కొన్ని దేశాలు అమెరికా నేతృత్వంలోని నాటోలో చేరాయి. 2008లో ఉక్రెయిన్, జార్జియాలకు నాటో సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమయింది. ఈ రెండింటింకి సభ్యత్వం ఇవ్వడానికి కారణం .. రష్యాను దెబ్బకొట్టడం. రష్యాను గుప్పిట్లోకి తెచ్చుకోవడం. నాటో దేశాల దళాలు కలిస్తే రష్యా సైన్యం సరిపోదు. అందుకే అమెరికా కుట్రలను కనిపెట్టిన పుతిన్ ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వవొద్దని డిమాండ్ చేస్తున్నారు. నాటో నుంచి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. 1997 ముందు నాటి స్థితికి నాటో దళాలు వెళ్లాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ సైన్యం కంటే రష్యా దళాల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే సైనిక రక్షణ లభిస్తుందని ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం కోరుతోంది.
అగ్రరాజ్యం.. ఆ స్థాయికి తగ్గట్లుగా స్పందించిందా ?
అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా.. పరోక్షంగా యుద్ధానికి కారణం. ఉక్రెయిన్ను నాటో కూటమికి దగ్గరగా తెచ్చి ఉండకపోతే రష్యా దాడికి పాల్పడి ఉండేది కాదు. నాటోలో చేరి చివరికి రష్యా మీదకు దండెత్తే ప్లాన్లలో ఉన్నారని పుతిన్ అక్కడి వరకూ తెచ్చుకోకుండా దాడులు తెగబడ్డారు. యుద్దం ప్రారంభించారు. ఈ పరిస్థితిని నివారించాల్సిన అమెరికా మాత్రం మాటలతోనే కబుర్లు చెబుతోంది. తగిన ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుందని అంటోంది. కానీ దాడులను ఆపే ప్రయత్నాలేమీ చేయడం లేదు. కానీ జో బైడెన్ మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత ఆలస్యమైతే అంత తీవ్రమవుతోంది. రష్యాపై ఎదురుదాడి చేసి .. నాటో దళాలను పంపి మూడో ప్రపంచ యుద్ధం తెస్తారా లేకపోతే లౌక్యంగా వ్యవహరించి ఇక నష్టాన్నైనా తగ్గిస్తారా అన్నది అమెరికా .. నాటో చేతుల్లో ఉంది. కానీ ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఇప్పుడు ఆ దేశాలు ఉన్నాయి.
ఈ నష్టం ఉక్రెయిన్‌ది మాత్రమే కాదు.. ప్రపంచానిది !
రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం అనూహ్యం . ఇటీవలి కాలలో ప్రపంచంలో యుద్దం అనే మాట వినిపించలేదు. ఉగ్రవాదంపై యుద్ధం చేస్తున్నారు కానీ.. దేశాల మధ్య జరగడం లేదు. కానీ రష్యా – ఉక్రెయిన్ మధ్య ప్రారంభమయింది. ఇది ఆ ఒక్క దేశానికే కాదు.. రష్యాకూ నష్టమే. ప్రపంచం మొత్తానికి నష్టమే. యుద్ధం పరస్పర వినాశకరం అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు యుద్ధానికి దిగకపోతే అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుదంని రష్యా అనుకుని రంగంలోకి దిగింది. అయితే నష్టం ఉక్రెయిన్‌కే కాదు.. ప్రపంచం మొత్తానికి. అక్కడి యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే యుద్ధం ఎంత త్వరగా ఆగిపోతే ప్రపంచానికి అంత మంచిది. కాదని ముందుకు వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తే జరిగేది వినాశనమే.