ప్రభుత్వ నిర్బంధాలు ఎల్లవేళలా పని చేయవని తేలిపోయింది. ఏదైనా టైం వస్తే తిరగబడమేనని మరోసారి రుజువైంది. ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వ నిర్బంధం ఓ రేంజ్లో ఉంది. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ జరిగేటప్పుడు అనుకూలమైన ఓటర్లరు మాత్రమే వచ్చేలా ఇతరులు రాకుండా భయానక వాతావరణాన్నిఎలా సృష్టిస్తారో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరిస్తారో అచ్చంగా అదే తరహాలో ధియేటర్ల వద్ద పరిస్థితులు కనిపించాయి ఎవరైనా ధియేటర్ వైపు వస్తే పోలీసులు కొడతారేమోనన్నంత హంగామా చేశారు. స్పెషల్ పోలీసుల్ని రంగంలోకి దించారు. ఉదయం ఎవరూ ధియేటర్ల వైపు రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.
కానీ ఎక్కువ సేపు ఉంచలేకపోయారు. కాసేపటికే అభిమానులంతా ధియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఫలితంగా ధియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. అభిమానుల సందోహంతో ఎక్కడా లేనంత ఉత్సాహం కనిపించింది. అప్పటికే టాక్ బయటకు రావడంతో అభిమానుల్లో ఇంకాఉత్సాహం కనిపించింది. పోలీసులు కూడా ఆంక్షలు పెట్టలేకపోయారు. అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేయడానికి కూడా తర్వాత సాహసించకపోయారు. నిర్బంధాల తర్వాత అభిమానుల ఉత్సాహం చూస్తూంటే పట్టుదలగా రెండింతలు కలెక్షన్లు తెప్పించాలన్న లక్ష్యంతో పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.ఎక్కడ చూసినా అభిమానుల జాతరే కనిపిస్తోంది.
వాస్తవానికి సినిమా విడుదల కాక ముందు నుంచే వైసీపీకి చెందిన కొంత మంది సినిమాపై నెగెటివ్ టాక్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరికి మంత్రులు కూడా ఇందులోకి దిగారు. సినిమా చూడకుండానే రివ్యూలు చెప్పేసి అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం చేయడం ప్రారంభించారు. విద్యా శాఖ మంత్రి సురేష్ ఓ అడుగు ముందుకేసి.. అట్టర్ ఫ్లాప్ అని తేల్చేసారు. అయితే అధికారం కోరుకున్నంత మాత్రాన.. ఆంక్షలు విధించినంత మాత్రాన సినిమాను ఫ్లాప్ చేయలేరని తేలిపోయింది. భీమ్లా నాయక్ బాక్సాఫీస్‌ను దడ పుట్టించడం ఖాయమని తేలిపోయింది. టిక్కెట్ రేట్లను తగ్గించడం వల్ల కొంత ఆదాయం కోల్పోతారేమో కానీ అంతకు మించి ప్రభుత్వంపై గెలిచిన ఇమేజ్ భీమ్లా నాయక్‌కు దక్కినట్లయింది.