ఇవాళ ఉదయం విడుదల అయిన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ మొదటి ఆట నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల లో జోష్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద రాజకీయ నినాదాలు సైతం వినిపించడం గమనార్హం. పైగా వైకాపా నేతలకు, ఈ థియేటర్ ల వద్ద పవన్ అభిమానుల సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.
గుడివాడలో జి 3 థియేటర్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్సీపీ నేతలు మంత్రులు అయినటువంటి కొడాలి నాని, పేర్ని నాని విచ్చేశారు. ఈ థియేటర్లో ప్రారంభ చిత్రంగా భీమ్లా నాయక్ ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు జనసేన అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఇటీవలికాలంలో వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలు తొక్కి వేసే విధంగా, పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తోందని పవన్ అభిమానులు వకీల్ సాబ్ సినిమా సమయం నుండి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొందరు అధికారులు సైతం ఆ ఆరోపణలు నిజమని అనిపించేలా ప్రవర్తించటం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కొడాలి నాని డౌన్ డౌన్, పేర్ని నాని డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్ నినాదాలతో థియేటర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని వరకు పరిస్థితి కొనసాగింది.
ఇదే విధంగా కుప్పం నెల్లూరు లో థియేటర్ల వద్ద కూడా, వైకాపా ప్రభుత్వం ఈ సినిమాపై కక్షపూరిత వైఖరి అవలంభిస్తోందని అంటూ ప్రేక్షకులు, అభిమానుల నుండి వైకాపా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపించడం చర్చకు దారి తీసింది.