భీమ్లా నాయక్ సినిమా ఇవాళ విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని పవన్ అభిమానుల లో జోష్ నింపింది . పలు చోట్ల ఈ సినిమా తక్కువ రేట్లకే అమ్మే విధంగా చేసి, పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ ఈ అంశంపై స్పందించారు. అయితే చంద్రబాబు లోకేష్ ల పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సిపి మంత్రులు. వివరాల్లోకి వెళితే..
భీమ్లా నాయక్ మీద కాదు, ఉక్రెయిన్ విద్యార్థులను తీసుకు వచ్చే విషయం పై దృష్టి సారించమన్న చంద్రబాబు:
ముందుగా చంద్ర బాబు ఈ అంశం పై ట్వీట్ చేస్తూ ” రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం @ysjagan వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ #BheemlaNayak సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ను తెలుగు రాష్ట్రం లో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. #Ukraine లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.” అని రాసుకొచ్చారు. నారా లోకేష్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ రిపోర్ట్స్ వింటున్నానని, అన్ని పరిశ్రమలను ధ్వంసం చేస్తూ వస్తున్న జగన్ సినీ పరిశ్రమకు కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
టిడిపి నేతలపై ధ్వజమెత్తిన వైకాపా మంత్రులు:
అయితే ఈ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, చంద్రబాబు లోకేష్ లు ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఈ విధంగా స్పందించారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్నప్పటికీ తండ్రీ కొడుకులు ఆయన కి ఏనాడూ మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అఖండ సినిమా సమయంలో బాలకృష్ణ జగన్ ని కలవడానికి ప్రయత్నించాడని, తాను ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తే, తన దగ్గరకు పిలిపించుకొని బాలకృష్ణను పలచన చేయవలసిన అవసరం లేదని, ఆయనకు ఏం కావాలో మీరే చూసుకోండి అని జగన్ తనతో చెప్పినట్లు నాని వివరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక ఈ సినిమాను విడుదల చేసుకొని ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా కి కూడా కొత్త రేట్లు వర్తించేవి అని నాని విమర్శించారు. అప్పట్లో సినిమాని ఫ్రీగా చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు టికెట్ రేట్ల కోసం రాద్ధాంతం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు
మరో వైపు మంత్రి బొత్స సత్య నారాయణ కూడా ఈ సినిమా కోసం చంద్రబాబు మద్దతు ఇవ్వడాన్ని తప్పు పడుతూ సంక్షేమం గురించి చంద్రబాబు మాట్లాడాలని, సినిమా గురించి కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ ఈగో కి పోయి పవన్ కళ్యాణ్ సినిమా ని అణిచేస్తున్నాడు అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఏది ఏమైనా భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కళ్యాణ్ రానా ల మధ్య జరిగిన హోరాహోరీ పోరు కంటే భీకరంగా బయట రాజకీయ నాయకుల పోరు ఉన్నట్లు కనిపిస్తోంది.