ఏపిలో వామపక్షాల నేతలు పి.మధు (సిపిఎం) కె.రామకృష్ణ (సిపిఐ)లు వాదన వింటే, ‘రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని?’ అని అడిగినట్లుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదనే సంగతి కేంద్రం ఇప్పటికే చాలాసార్లు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది. దాని గురించి కేంద్రాన్ని గట్టిగా అడిగే ఉద్దేశ్యం లేదని చంద్రబాబు నాయుడు స్పష్టంగానే చెపుతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దేని కారణాలు, సాకులు దానికి ఉన్నాయి కనుక ఇక ప్రత్యేక హోదా రాదని ప్రజలు కూడా మానసికంగా అంగీకరిస్తున్నారు.
పి.మధు, కె.రామకృష్ణలు కూడా ఈ ‘ప్రత్యేక హోదా’ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి అంతా మరొక్కసారి వివరించిన తరువాత దానిని సాధించడానికి చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. దాని కోసం రాష్ట్ర ప్రజలు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, కానీ చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమను కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరలో జరుగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాలలోనే రాయలసీమ కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేసారు. పట్టిసీమ కంటే ముందు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించి ను సకాలంపూర్తి చేయాలని వారు కోరారు.
రాయలసీమకి వెయ్యి కోట్లు కేటాయించాలని కోరుతూ ఈనెల 15న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని, పేదలకు ఇళ్ళను సమకూర్చాలని కోరుతూ మళ్ళీ ఈనెల 22న ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. అలనాడు యమధర్మ రాజు సావిత్రిని పతి ప్రాణంబులు తప్ప వేరేదయినా వరం కోరుకోమన్నట్లుగా, ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ అనే మూడు కాకుండా ఇంక దేనిగురించయినా మాట్లాడమని చెపుతున్నారు. కనుక వామపక్షాల నేతలు ఇద్దరూ రాయలసీమకు వెయ్యి కోట్లు ఆర్ధిక ప్యాకేజి, ప్రాజెక్టులు పూర్తి చేయడం, పేదలకు ఇళ్ళు వంటి ఇతర అంశాల గురించి మాట్లాడితే ఏమయినా ప్రయోజనం ఉంటుందేమో?