వైఎస్ ఫ్యామిలీలో అవినాష్ రెడ్డి కుటుంబం వేరని.., వారికి జగన్ సపోర్ట్ మాత్రమే ఉందన్న విషయానికి అనేక సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ సోదరుల్లో ఒకరైన వైఎస్ ప్రతాప్ రెడ్డి గత ఏడాది సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డి ఫ్యామిలీపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు గుండె పోటు అని చెప్పారు కానీ వాస్తవంగా తాను వెళ్లి చూస్తే హత్య చేసినట్లుగానే అనుమానం వేసిందని కానీ అందరూ గుండెపోటు అని ప్రచారం చేస్తూండటంతో తాను నోరు మెదపలేదని సీబీైకి చెప్పారు.
వైఎస్ అవినాష్ రెడ్డి సహా నిందితులంతా సాక్ష్యాలు తుడిచేశారని ప్రతాప్ రెడ్డి సాక్ష్యం ఇచ్చారు. అంతే కాదు హత్య జరగడానికి వారం ముందు తన ఆఫీసుకు వచ్చారని.. కడప ఎంపీ టికెట్ షర్మిలకు లేదా ఆమె తల్లి విజయమ్మకు ఇవ్వాలని అనుకున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమైందని సీబీఐకి తెలిపారు. అవినాశ్ రెడ్డి తండ్రి ఎప్పుడూ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వల్లే ఓడిపోయానని వివేకానంద రెడ్డికి తెలిసిందని కూడా ప్రతాప్ రెడ్డి వివరించారు.
కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి సీబీఐ తీసుకున్న వాంగ్మూలాల్లో అత్యధిక వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డినే నిందితులుగా చూపిస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీలో వారు ఇస్తున్న స్టేట్మెంట్లు కూడా వాటినే ధృవీకరిస్తున్నాయి. అవినాష్ ఫ్యామిలీకి అందరూ వ్యతిరేకంగానే ఉన్నారని తేలిపోతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మాత్రం వారికి కొండంత అండగా ఉంటోంది.