తెలంగాణ ప్రభుత్వం ఓ ఐపీఎస్ ఆఫీసర్ని విధుల్లో చేర్చుకోవడానికి నిరాకరిస్తోంది. ఆ ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతి. ఆయనను విభజనలో భాగంగా ఏపీకి కేటాయించారు. కానీ ఆయన తనది తెలంగాణ అని… తెలంగాణ క్యాడర్ ను క్యాట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కానీ అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేర్చుకోవడం లేదు. దీంతో అభిషేక్ మహంతి ఆరు నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారు. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కారణాలు చెబుతూండటంతో క్యాట్ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిజానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ది ఏపీ క్యాడర్. కానీ ఆయన క్యాట్‌కు వెళ్లి తెలంగాణలో ఉండేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అభిషేక్ మహంతి అదే పని చేస్తే ఆయనను విధుల్లో చేర్చుకోవడానికి అంగీకరించడం లేదు. అయితే ఇక్కడ సీఎస్ ఇష్టాలు కన్నా ప్రభుత్వ పెద్దల అభిప్రాయం ఎక్కువగా ఉంటుందని అనుకోవాలి. అభిషేక్ మహంతి విషయంలో ఎందుకు ప్రభుత్వం నెగెటివ్‌గా ఉందో సివిల్ సర్వీస్ వర్గాలకు అర్థం కావడం లేదు.
అభిషేక్ మహంతి .. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఏకే మహంతి కుమారుడు. ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకూ కీలక బాధ్యతల్లో పని చేశారు. తర్వాత గవర్నర్‌కు సలహాదారుగా కూడా పని చేశారు. ఆయన ఇద్దరు కుమారులు ఐపీఎస్ అధికారులే. ఒకరు ఇప్పటికే తెలంగాణ క్యాడర్లో ఉన్నారు. మరొకర్ని మాత్రం క్యాట్ ఆదేశాలున్నా తీసుకోవడం లేదు. క్యాట్ డెడ్ లైన్ పెట్టింది కాబట్టి వారంలో పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందనుకోవచ్చు.