శుక్రవారం విడుదలైన `భీమ్లా నాయక్` సూపర్ హిట్టు కొట్టింది. ఈరోజే చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్లో దాదాపుగా చిత్రబృందం అంతా పాల్గొంది. కానీ పవన్ కల్యాణ్, రానాలు తప్ప. పవన్ కల్యాణ్ ఇలాంటి సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటాడు. కానీ రానా కూడా రాకపోవడం ఆశ్చర్యం అనిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కనిపించినా, వేదికపైకి రాకుండా, మాట్లాడకుండా నిరుత్సాహ పరిచిన త్రివిక్రమ్ మాత్రం.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి, అభిమానుల్ని ఖుషీ చేశారు. అయితే.. ఎక్కడా `ఈ సినిమాతో కొట్టేశాం, పొడిచేశాం.. ఊగిపోకుండా, చాలా కూల్‌గా, సెటిల్డ్ గా మాట్లాడారు. వేదికపై ఏ ఒక్కరు కూడా వివాదాస్పద అంశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. దానికి తోడు… మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌కి అవకాశం కల్పించలేదు. తాము ఏం మాట్లాడాలో, అది మాట్లాడేసి వెళ్లిపోయారంతే. ఒకవేళ మీడియాతో ప్రశ్నలు – జవాబులూ పెట్టుకుంటే ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై స్పందించాల్సి ఉంటుంది. అందుకే ఇలా జాగ్రత్త పడ్డారు. అయితే ఇది కేవలం థ్యాంక్స్ మీట్ మాత్రమే అని, త్వరలో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. ఆ వేడుకకి పవన్, రానాలు వస్తారేమో చూడాలి.