చాలా రోజుల తరవాత మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. భీమ్లా నాయక్ ని స్తుతించడానికి ఈ వీడియో చేశారనుకుంటే పొరపాటు. పవన్ కల్యాణ్ ని సపోర్ట్ చేయని హీరోల్ని, దర్శకుల్ని, నిర్మాతల్నీ ఓ రౌండ్ వేసుకోవడానికి ఈ వీడియో వదిలారాయన. `రిపబ్లిక్` ప్రీ రిలీజ్ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడడం, దానిపై వైకాపా నేతలు సీరియస్ అవ్వడం, భీమ్లాని టార్గెట్ చేయడం ఇవన్నీ తెలిసిన అంశాలే. శుక్రవారం ఏపీలో అనేక ఆంక్షల మధ్య భీమ్లా నాయక్ విడుదలైంది. థియేటర్ల దగ్గర ఎంఆర్వోలూ, ఆర్.ఐలు, వాలెంటరీలూ కాపాల ఉండి, పాత జీవో ప్రకారమే టికెట్లు అమ్మేలా జాగ్రత్త పడ్డారంటే .. పవన్ పై పగ – ప్రతీకారాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని, కొత్త రేట్లు వస్తాయని, పెద్ద సినిమాలకు వెసులుబాటు కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఈనెల 20నే కొత్త జీవో వస్తుందని, కొత్త రేట్లు అమలు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ.. భీమ్లా నాయక్ వచ్చి, వెళ్లిపోయిన తరవాతే కొత్తరేట్లు ప్రకటిస్తారని తెలియడంతో, భీమ్లాని రిలీజ్ చేయాల్సివచ్చింది.
ఈ విషయాలపైనే నాగబాబు విపులంగా మాట్లాడారు. రిపబ్లిక్ ఫంక్షన్ లో పవన్ మాటల్ని ఓసారి గుర్తు చేశారు. పవన్ ఆ రోజు.. ఇండ్రస్ట్రీ తరపున మాట్లాడాడని, తన కోసం పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దన్నాడని, అవసరమైతే తన సినిమాలు ఆపుకోమని చెప్పాడని, ఇదంతా ఇండస్ట్రీ కోసం చేసినా, ఎవరూ ముందుకు రాలేదని, ఒక్క హీరో కూడా పవన్ కి అనుకూలంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. ఓ హీరో సినిమాని కావాలని అన్యాయంగా తొక్కేస్తోంటే, ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలూ ఉన్నా ఒక్కరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ”చంపేస్తారని భయమా” అంటూ నేరుగానే ప్రశ్నించారు. ”మీ భయాల్ని, బలహీనతల్నీ మేం అర్థం చేసుకుంటాం. రేపు మీ సినిమాకి సమస్య వస్తే కల్యాణ్ బాబు ముందుంటాడు. ఎందుకంటే మీలా కల్యాణ్ భయస్తుడు కాదు” అంటూ ఓ చురక అంటించాడు నాగబాబు. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు నాశనం అయిపోయేవారని, ఈ సినిమా ఫ్లాపయినా పవన్ కి నష్టం లేదని, ఓ సినిమా తీసి, పదిమందికీ ఉపాధి కల్పించాలన్న నిర్మాత మాత్రం దారుణంగా నష్టపోయేవాడని.. ఈపరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు.