కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి పోలవరం వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వీలయినంత త్వరగా తెచ్చి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లను త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కానీ 2013-14 నాటి ధరలే చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ అంశం పీట ముడి పడిపోయింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నాయి. వీటిని ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే పునరావసం, నష్టపరిహారం విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య చర్చలు తెగడం లేదు.
ఈ క్రమంలో పోలవరం ఎత్తు తగ్గిస్తే చాలా ఖర్చు మిగిలిపోతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అదే జరిగితే అది ప్రాజెక్టు కాదని బ్యారేజీ పడిపోతుందని ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్ారు. అయితే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పోలవరం భారాన్ని మోయడానికి సిద్ధంగా లేవు. దీంతో షెకావత్ పర్యటనలో ఎలాంటి ప్రకటనలు వస్తాయన్నదానిపై చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ గా కేంద్రం గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒక్క ఏపీకే కాదని దేశం మొత్తానికి ఉపయోగమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దీన్నయినా గుర్తుంచుకుని ప్రాజెక్టును ప్రాజెక్టుగా ఉంచుతారో… బ్యారేజీగా మారుస్తారో మార్చి నాలుగో తేదీన తేలే అవకాశం ఉంది.