ఏపీలో రాజకీయ హత్యలు అంతకంతకూ పెరిగిపోతాయని సీపీఐ నేత నారాయణ ఆందోలన చెందుతున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అదే చెబుతున్నారు. రాజకీయాల కోసం హత్యలు చేసే సంస్కృతి ఏపీలో పెరిగిపోతోందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో అందరికీ అంతా అర్థమైపోయిందని ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ రాజకీయ హత్యలు ఇంతటితో ఆగవని.. భవిష్యత్లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం హత్యలు జరుగుతాయన్నారు.
వీటిని నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ హత్యలు జరగకుండా సీబీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మొన్న కూడా ఏపీలో కోల్డ్ మర్డర్ల వ్యవస్థ ఏర్పడిందని.. రాజకీయంగా ఎవరు అడ్డం వస్తే వారిని చంపేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని నారాయణ అభిప్రాయం .
ఇప్పటి వరకూ జరిగిన రాజకీయం వేరు.. ఇక ముందు జరిగే రాజకీయం వేరని ఆయన భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న వారు ప్రత్యర్థుల్ని నిర్మూలించడానికి సిద్ధపడే ప్రమాదం ఉందని నారాయణ అంచనా వేస్తున్నారు. ఏపీలో ఉన్న రాజకీయాలు నారాయణ అంచనా వేసినంత దారుణంగానే ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.