ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలా బయటకు పంపాలా అని టీఆర్ఎస్ కొంత కాలంగా చూస్తోంది. అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగులో శుక్రవారం రాత్రి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఘర్షణ జరిగింది. పొంగులేటి, ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలను ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులను పిలవలేదు. అసలు ఈ కార్యక్రమం వద్దని ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెచ్చి నిలుపుదల చేయిచారు.
కానీ పొంగులేటి మాత్రం .. పిడమర్తి రవితో ఆవిష్కరింపచేశారు. దీంతో రేగా, పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై స్పందించిన రేగా కాంతారావు పొంగులేటి టీఆర్ఎస్లో లేడని.. మండిపడ్డారు. తాను గులాబీ పార్టీలోనే ఉన్నానని అనుమానాలు ఉంటే పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఎవరికీ బీఫామ్ ఇచ్చినా వారితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అది రేగా అయినా మరోక నేత అయినా ఖచ్చితంగా వారి గెలుపు కోసం కృషిచేస్తానన్నారు.
రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చారు. అక్కడ పాయం వెకంటేస్వర్లు అనే టీఆర్ఎస్ నేతను పొంగులేటి ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్లో తన అనుచరుల్ని బలంగా ప్రోత్సహిస్తున్నారు పొంగులేటి. ఇప్పుడు ఈ గొడవతో హైకమాండ్‌తో పొంగులేటికి మరింత దూరం పెరగడమే కాదు.. ఆయన పార్టీలో లేరన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించారు.