ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాదికి పూర్తి చేయాలని జగన్ డిసైడయినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ స్పష్టతకు వచ్చాయి. ఈ సందర్భంగా అత్యంత విధేయులకూ మినహాయింపు లేదన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. మంత్రి వర్గంలో పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు వంటి వారు జగన్ పై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మంత్రి వర్గం నుండి తీసేసినా,ఎమ్మెల్యేగా పని చేయకపోయినా,జగన్ కారు డ్రైవర్ గా పని చేస్తానంటూ కొడాలి విధేయత చూపారు. అయితే ఆయన వల్ల అసలు పార్టీకి నష్టం జరుగుతోందన్న అభిప్రాయం జగన్‌లో కూడా ఏర్పడిందని చెబుతున్నారు. అయితే కొడాలి నానికి విధేయతతో పాటు ఎన్నో మైనస్‌లు ఉన్నాయి. కొడాలి నాని గుడివాడ కేసినోవా వ్యవహరం, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పై హత్యా యత్నం ఎపిసోడ్ లో గన్‌మెన్లు ఇప్పించి మరీ తిరస్కరించేలా చేయడం జగన్‌ను ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.
ఇక వెల్లంపల్లి ఎప్పుడూ వివాదాస్పద వ్యవహారాల్లోనే బయటకు వస్తున్నారు. అందరితో పాటు పేర్ని నానికి కూడా షాకివ్వడం ఖాయమంటున్నారు. వీరందర్నీ పార్టీ పనులకు ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. సీఎం జగన్‌కు ఏదీ నాన్చడం ఇష్టం ఉండదు. ఫటాఫట్ చేసేస్తారు. ఈ క్రమంలో వంద శాతం మంత్రులను మార్చడం ఖాయమని అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఉగాది కల్లా ప్రక్రియ పూర్తి చేస్తారని భావిస్తున్నారు.