ఎర్రబెల్లి దయాకరరావు తెరాస పార్టీలో చేరడం ఆ పార్టీని కనీసం వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు దెబ్బతీస్తుందా? లాభిస్తుందా? నిజానికి ఎర్రబెల్లి వంటి సీనియర్ నేత వచ్చి పార్టీలో చేరితే.. లాభమే ఉండాలి. కానీ ఆ పార్టీ జిల్లాకు సంబంధించినంతవరకు అసంతృప్తులు రగులుకుంటున్నాయి. జిల్లా అంతా పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. కొత్తగా వచ్చిన వ్యక్తి ఎర్రబెల్లే గనుక.. జిల్లాలో తెరాస నాయకులతో తమకున్న విభేదాలన్నీ సమసిపోయాయని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ వాస్తవానికి అంతా నివురు గప్పిన నిప్పు మాత్రమే నని.. ఏ క్షణంలో అయినా.. మంటలు రాజుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎర్రబెల్లి వచ్చి చేరడం పట్ల అదే జిల్లాకు చెందిన తెరాస సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, దాస్యం వినయభాస్కర్లలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. కడియంతో విభేదాలు లేవని.. తామిద్దరితోనూ కేసీఆర్ రాజీ చేసేశాడని.. గురువారం నాడు ఎర్రబెల్లి వాక్రుచ్చారు. అయితే ఈ మాటలు నమ్మడానికి లేదు. ఎందుకంటే.. ఆయన అధికారికంగా గులాబీ కండువా వేసుకున్న కార్యక్రమానికి కడియం నాగా పెట్టారు. అంటే అసంతృప్తి ఇంకా రాజుకుంటున్నదనే అర్థం. అదే సమయంలో వరంగల్ సిటీలోని ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మరో రేంజిలో అసంతృప్తి కక్కుతున్నారు. ఆయన ఎర్రబెల్లి కి కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో దక్కిన ప్రాధాన్యంచూసి.. అలిగి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెరాస రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి.
ఈ రకంగా.. ఎర్రబెల్లి రాక అనేది తెరాసకు ఎంతగా లాభిస్తుందో గానీ.. వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి సంబంధించినంత వరకు ముఠాలు పెరగడానికి దారితీస్తోంది. ఎటూ ఆ జిల్లాలో బలమైన మరో అంతర్గత ప్రత్యర్థి వర్గంతో కొండా సురేఖ వర్గం ఉండనే ఉంది. ఈ కోణంలోంచి గమనించినప్పుడు ఎర్రబెల్లి ద్వారా తెరాసకు మేలు కంటే చేటు ఎక్కువని పలువురు అనుమానిస్తున్నారు.