ఎంత వరకు నిజమో గాని ఎవరికి సంబంధించిందో గానీ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్న ఒక కథ ఇది. మొన్న ఎన్నికల్లో గెలవలేకపోయిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేశారు. టిఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానించారు. మాటల మధ్యలో మరో ముక్క కూడా జోడించారు. ‘ మీరు రావాలని మా అబ్బాయి గట్టిగా ముచ్చట పడుతున్నాడు. పిలవమంటున్నాడు. ఎలాగైనా వస్తే బాగుంటుంది’ అని చెప్పారు. సిఎం అడగడమే గాక కుమార రత్నాన్ని కూడా ప్రస్తావించే సరికి ఆ మాజీ మంత్రి వర్యుడు కాస్త మెత్తబడ్డాడు. సరే కాస్త ఆలోచించి చెప్తా అన్నాడు. ఈ లోగా ఈ విషయం హైకమాండ్‌కు తెలసింది. యువరాజు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఇదేమిటి మీరు వెళ్లకండి అని కాస్త గట్టిగా చెప్పాడు. గతంలో కాంగ్రెస్ వల్ల బాగా లాభం పొందిన ఆ మాజీ కొంచెం వెనక్కు తగ్గాడు. టెంపరరీగానే సుమా.. ఈ సారి టిఆర్ఎస్ ఫోన్ వచ్చేసరికి సమాధానం సిద్ధం చేసుకున్నాడు. ‘ రాహుల్ గాంధీ ఫోన్ చేశాడు. ఆయన అంతగా చెప్పాక బేఖాతర్ చేయకుంటే బాగుండదు కదా.. జర రెండు నెలలు టైము తీసుకుంట అన్నాడు. ఆ తర్వాత ఎలాగూ వచ్చేస్తాడని అర్థమై వీరు కూడా బలవంతం చేయకుండా వదిలేశారు. టిడిపి తర్వాత కాంగ్రెస్‌ను ఖాళీ చేయించే క్రమంలో ఇదీ కెసిఆర్ స్టైల్.
కాంగ్రెస్ యువ నాయకులొకరు చెప్పిన ఈ సంగతి టిఆర్ఎస్ ప్రజా ప్రతినిదితో చెబితే చప్పరించేశాడు.మా వాడికి మాజీలు ఎంఎల్ఎలు కాని వారు అక్కర్లేదు.. జానారెడ్డి, జీవన్‌రెడ్డి వంటి వారు వస్తే ఓకె.. అన్నాడు. ఇప్పుడు మాజీ మంత్రి డికెఆరుణ కూడా నిరీక్షణలో వున్నారట. కాకుంటే మహబూబ్‌నగర్‌నుంచి గద్వాలను విడదీసి ప్రత్యేక జిల్లా చేయడంపై ఆమె చేరిక ఆధారపడి వుందంటున్నారు. అందుకే అన్నారు- ఏ పార్టీలో ఎవరు శాశ్వతం?