దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ పదే పదే చెబుతూంటారు . అయితే కేసీఆర్ చెప్పేది మాట వరుసకేమో అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ కేంద్రం కూడా చెబుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి , తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు సాధించనంత వృద్ధిని నమోదు చేసింది. జీఎస్డీపీ అంటే ఓ రకంగా రాష్ట్ర సంపద సృష్టి అనుకోవచ్చు. ఈ సంపద సృష్టిలో దాదాపుగా ఇరవై శాతం వృద్ధి నమోదు అయింది.
తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. తెలంగాణలో ప్రతి మనిషి సగటున రూ. రెండు లక్షల 78 వేల వరకూ సంపాదిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్డీపీ వృద్ధిరేటు 2.25 శాతం మాత్రమే కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు గత ఏడాది కంటే 17 శాతం ఎక్కువ సాధించింది. రాజకీయంగా ఎలా ఉన్నా తెలంగాణ సామాజికంగా.. ఆర్థిక పరంగా మెరుగ్గా అభివృద్ది చెందుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది.
దానికి తగ్గట్లుగానే నివేదికలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ నగరం తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నగరం కారణంగానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపైనా టీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయమైన దృష్టి పెట్టింది.. అనుకున్నట్లుగా అభివృద్ధి చేస్తోంది. తెలంగాణను దూసుకెళ్లాలా చేస్తోంది.