సినీ నటుడు అలీకి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జోరుగా సాగింది.అయితే అనూహ్యంగా ఆ పదవి భర్తీ అయిపోయింది. వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ సన్నిహితుడు ఖాదర్ భాషా ఎన్నికయ్యారు. వక్ఫ్ బోర్డుకు చైర్మన్ ను ప్రభుత్వం నియమించదు. మొత్తం తొమ్మిది సభ్యులు ఎన్నుకోవాలి. ఈ సభ్యుల్ని ప్రభుత్వం నియమిస్తుంది. గత ప్రభుత్వం నియమించిన ముగ్గురు వక్ఫ్ బోర్డులో ఉండగా.. రెండు వారాల కిందట జగన్ ప్రభుత్వం మరో ఆరుగుర్ని నియమించింది. దీంతో మెజార్టీ ఉండటంతో సోమవారం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ను ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి రావాలని కొద్ది రోజులకిందట అలీకి ఆహ్వానం పలికారు. వక్ఫ్ బోర్డు సభ్యులు వెళ్లి ఆహ్వానించారు. తాను వస్తానని అలీ కూడా చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆయన వెళ్లలేదు. వైసీపీ హైకమాండ్ వెళ్లవద్దని చెప్పి ఉంటుందని…హాఫిజ్ ఖాన్ అనుచరుడికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు అలీకి రాజ్యసభ సీటు కళ్ల ముందు ఉంది.
సీఎం జగన్ పిలిచి గుడ్ న్యూస్ చెబుతామని చెప్పారు కాబట్టి పదవి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.అయితే రాజ్యసభ సమీకరణాల్లో ఎక్కడా తేడా కొట్టినా అలీకి ఏ పదవి రాకుండా పోతుంది. రాష్ట్ర స్థాయిలో ఏ పదవి ఇచ్చినా అది రాజ్య సభ కంటేచిన్నదే అవుతుంది . రాజ్యసభకు అలీ పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. రాజ్యసభ కాకపోతే ఏదో ఓ పదవి అనుకున్నా.. ఇప్పుడు ఏదీ దక్కదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.