కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించబోయే హిందీ వెర్షన్ కి కూడా కొరటాల శివే దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగులో ఆ చిత్రం విడుదలయినప్పుడు పెద్దగా వివాదాలు లేకుండానే నడిచిపోయింది. సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో అందరూ చాలా లాభపడ్డారు అందుకు చాలా సంతోషించారు.
ఇప్పుడు దానినే హిందీలో తీసేందుకు సిద్దమవుతుంటే, శరత్ చంద్ర అనే రచయిత దానిపై అభ్యంతరం తెలుపుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తాను నాలుగేళ్ల క్రితం స్వాతి మాస పత్రిక కోసం వ్రాసిన నవలనే దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాగా తీసారని, మళ్ళీ ఇప్పుడు దానిని హిందీలో కూడా తీయలనుకొంటున్నారని కనుక తనకు న్యాయం జరిగేవరకు హిందీ లేదా మరే బాషలోను ఆ సినిమాని రీమేక్ చేయకుండా నిరోధించాలని తన శరత్ చంద్ర తన పిటిషన్ లో కోరారు. దానిని ఇవ్వాళ్ళ విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సింగారెడ్డి ప్రతివాదులుగా పేర్కొనబడిన దర్శకుడు కొరటాల శివ, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ లకు దీనిపై సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేశారు.