తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఫ్యాక్షన్ సినిమాల్లో నాయకుడి కుటుంబాలకు అంటుగట్టుకున్న అనుచరగణాల్లాగా.. నిత్యం తన వెంటే ఉంటారని జగన్ అనుకుని ఉండవచ్చు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులే కాదు.. శాశ్వత మిత్రులు మాత్రమే కాదు.. శాశ్వత బంధువులు కూడా ఉండరనే విషయం ఆయనకు భూమా నాగిరెడ్డి ఎపిసోడ్‌తో స్వానుభవంలోకి వచ్చి ఉండాలి. అసలే ప్రతిపక్షం.. ఉన్నది 67 మంది ఎమ్మెల్యేలు. వారిలో అయిదుగురు ఉన్నపళాన జారిపోతే.. ఆయన కడుపు మండడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబునాయుడు ఒకవైపు తెలంగాణలో తెరాస తెరెత్తిన ఫిరాయింపుల్ని ఈసడిస్తూనే.. ఏపీలో తాను కేసీఆర్ ఫార్ములానే ఫాలో అయిపోవడం అనైతికమే..! అందువలన జగన్ ఆక్రోశం తప్పని చెప్పడానికి ఎంతమాత్రమూ అవకాశం లేదు. ఆయనది ధర్మాగ్రహమే అని చెప్పాలి. చంద్రబాబునాయుడు ఇందుకు ఏదో ఒక రోజున కనీసం ప్రజలకైనా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఆ అంశాన్ని పక్కన పెడితే..
ఇక్కడ ఒక సందేహం కలుగుతోంది. తన పార్టీనుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదంటూ జగన్ మేకపోతు గాంభీర్యం వెలిబుచ్చుతున్నారు. నాయకకుడిగా మిగిలిన వారిని కాపాడుకోవడానికి, ఆత్మస్థైర్యం నింపడానికి ఆయన అలా మాట్లాడాల్సిందే. పనిలో పనిగా అనైతికంగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు సర్కారుకు మితిమీరిన శాపనార్థాలు పెడుతున్నారు. పోతే పోయార్లే.. మరో ఏడాదిలో అంతా వచ్చేస్తారు అని.. మూడో సంవత్సరం అంతా అటునుంచి మా పార్టీలోకి క్యూ కడతారు అని ఆయన అంటూనే ఉన్నారు.
అంతా బాగానే ఉంది. అయితే సామాన్యులకు లుగుతున్న సందేహం ఏంటంటే.. వైఎస్ జగన్మోహనరెడ్డి తెలంగాణలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను తన పార్టీకింద భావించడం లేదా? అక్కడి పార్టీని ఆయన గాలికి వదిలేశారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. తెలంగాణలో వైకాపాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు ఇప్పటికే తెరాసలో చేరిపోయారు. అయినా జగన్ ఇప్పటిదాకా ఎన్నడూ వారి ఫిరాయింపుల గురించి నోరెత్తి మాట్లాడింది లేదు. ఏదో నామమాత్రంగా ఆయన పార్టీ తరఫున స్పీకరుకు ఒక ఫిర్యాదు ఇచ్చి ఊరుకున్నారు తప్ప.. అక్కడి ఫిరాయింపుల గురించి ఆయన ఏనాడూ పెదవి విప్పలేదు. అందుకే జనం ఆశ్చర్యపోతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే 67 మందిలో 5గురు వెళ్తే ఇంత ఆవేదన ఉన్నప్పుడూ.. ఉన్న ముగ్గురిలో ఇద్దరు వెళ్లిపోతే.. ఆరోజున కేసీఆర్‌ను ఎందుకు నిందించలేదు.. వారి వైఖరిని ఎందుకు తప్పుపట్టలేదు. వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అధ్యక్షుడిగా ఎందుకు డిమాండ్ చేయలేదు అని జనం అనుకుంటున్నారు.
జగన్ వద్ద ద్వంద్వ ప్రమాణాలు అయినా ఉండి ఉండాలని లేదా, తెలంగాణలో పార్టీ ఎలా నాశనమైతే నాకేంటిలే.. అని ఉపేక్ష భావమైనా ఉండి ఉండాలని అంతా అనుకుంటున్నారు.