ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మీద ఇప్పుడు తెలుగుదేశం కొత్త విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది. ఆయన చీకటి కార్యకలాపాలను బయటకు తీసి.. వాటిని గురించి ప్రశ్నించడం ద్వారా.. ఆయనను ‘పాయింట్ ఆఫ్ నో రిటర్న్’ వద్ద ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో గడిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన తన బసనుంచి బయటకు వెళ్లి ఎవరితో భేటీకి వెళ్లాడో ఆ రహస్యాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదంటూ తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కొత్త పాయింటు బయటకు తీస్తున్నారు.
జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా సరే.. ఆయన తన మీదున్న కేసులను మాఫీ చేయించుకోవడానికి, వాటి తీవ్రతను తగ్గించుకోవడానికి కేంద్రాన్ని బతిమాలడానికే వెళ్తున్నాడని తెలుగుదేశం నాయకులు తూర్పారపడుతూ ఉంటారు. ఇది ప్రతిసారీ జరిగేదే. దానికి తగినట్లుగానే కేసుల వ్యవహారం పీక్స్‌కు చేరుకున్న & ప్రతిసారీ ఆయన కూడా ఢిల్లీ వెళుతుంటారు. ఈసారి కూడా ఈడీ నోటీసులు పంపడం.. సీబీఐ కేసుకు సమాంతరంగా ఈడీ కూడా విచారణకు పిలవడం పట్ల చికాకుగా ఉన్న సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళ్లారు.
రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించడానికే వెళ్లానని ఆయన చెప్పవచ్చు గాక.. కానీ.. నేపథ్యం మాత్రం ఇలా కూడా సందేహాలు కలిగించే విధంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ ఢిల్లీలో ఉండగా అర్ధరాత్రి ఒంటిగంటకు తాను బయటకు వెళ్లాడని తెదేపా నాయకుడు బోండాం ఉమా ఆరోపిస్తున్నారు. దీనిద్వారా ఆయన తెరవెనుక హస్తినలో ఏదో మంత్రాంగం నడిపిస్తున్నాడనే అనుమనాలను జనంలో నాటడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మరి తాజా సంచలన వ్యాఖ్యలపట్ల జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి!!