వివేకా హత్య కేసులో ముందు ముందు సంచలనాలు ఉంటాయని తెలుస్తోంది. ఎవరు హత్య చేశారు.. ఎవరు చేయించారన్న అంశాన్ని కూపీ లాగే విషయంలో సీబీఐ సంచలన వాస్తవాలు కనుగొన్నదని తెలుస్తోంది. వివేకా హత్య కు రూ. నలభై కోట్ల సుపారీ ఇచ్చేందుకు అంగీకరించారు. అందులో మొదటగా ఒప్పందం ప్రకారం రూ. కోటి సునీల్ యాదవ్‌కు చేరుకుంది. ఈ సొమ్మును సీబీఐ ఫ్రీజ్ చేసింది. ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు ఇచ్చారు..? హత్య కోసం రూ. నలబైకోట్లు ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీసి లోగుట్టు కనిపెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ పాత్రధారుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సూత్రధారుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ సూత్రధారులెవరో కనిపెట్టడానికి ఈ సుపారీ డబ్బులు ఎవరు ఇస్తారో తేల్చినట్లుగా తెలుస్తోంది. తుది చార్జిషీట్లో ఈ అంశమే కీలకమయ్యే అవకాశం ఉంది. అంత పెద్ద మొత్తంలో సొమ్మను కూడబెట్టాలంటే దానికి చాలా మంది పెద్ద వ్యక్తులే సాయం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ లెక్కంతా సీబీఐ బయటకు తీస్తుందని అంచనా వేస్తున్నారు.
సీబీఐ అధికారులు ఈ కేసులో తదుపరి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కీలమకైన వ్యక్తుల వాంగ్మూలల బయటకు వచ్చాయి. దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వతా ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా బయటకు తెలియలేదు. అందులో ఉన్న విషయాలను బట్టి మరింత దూకుడుగా సీబీఐ వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికైతే పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల వైపు ఎలాంటి కొత్త వాహనం వస్తున్నా.. వారు సీబీఐ అధికారులేనా అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి అనుచరుల్లో ఈ పరిస్థితి ఎక్కువ ఉంది.