ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగంలో వివాదాస్పద అంశాల జోలికి ప్రభుత్వం పెద్దగా వెళ్లలేదు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారు. మూడు రాజధానుల విధానానికే కట్టుబడ్డామని అదేపనిగా చెబుతూ వస్తున్న ప్రభుత్వ పెద్దలు గవర్నర్ ప్రసంగంలోనూ దాన్నే చేరుస్తారని అనుకున్నారు. కానీ ఇతర అంశాలన్నింటినీ చెప్పారు కానీ మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం తీసుకు రాలేదు. ఇక్కడ ఉన్న ట్విస్టేమిటంటే… మూడేళ్లగా వికేంద్రీకృత పరిపాలన చేస్తున్నామని.. వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని ప్రకటించుకోవడం.
ప్రభుత్వ పథకాలు.. లక్ష్యాలు.. పోలవరం వంటి వాటిని మొత్తాన్ని వివరించిన గవర్నర్ .. రాజధాని అంశంపై మాత్రం ప్రసంగించలేదు. కోర్టుతీర్పు విషయంలో ప్రభుత్వం అసహనంగా .., న్యాయవ్యవస్థ పరమితులపై అసెంబ్లీలో చర్చించబోతున్నారని అనుకున్నారు. అందుకే గవర్నర్ ప్రసంగంలోనూ ఆ అంశం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు.
అసెంబ్లీలో కూడా హైకోర్టు తీర్పుపై చర్చిస్తామని వైసీపీ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. కానీ అలా చేయడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడుతుందన్న భయంతో వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బయట మాత్రం మంత్రి బొత్స సత్యనారాయణ… ఎవరి పని వాళ్లు చేయాలని..చట్టాలు చేయవద్దని అసెంబ్లీని ఆదేశించడం సరి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అసెంబ్లీలో చర్చిస్తామని మాత్రం చెప్పడం లేదు.
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ధర్మాన రాసిన లేఖలో ప్రత్యేకఅసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కోరారు. బహుశా.. వైసీపీ వ్యూహం అదే అయి ఉటుందని.. ప్రస్తుత సమావేశాల్లో చర్చించే అవకాశం లేదని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.