అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వైసీపీ నేతలు బయట చేస్తున్న ప్రకటనలకు.. అధికారికంగా చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. తీర్పు వచ్చినప్పటి నుండి బొత్స సత్తిబాబును తీరిక లేకుండా మీడియాతో మాట్లాడమని పురమానిస్తున్న హైకమాండ్ .. ఒక్కో సారి ఒక్కోటి చెప్పమంటోంది. ఫలితంగా బొత్స ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఓ సారి మూడు రాజధానులంటారు.. మరోసారి హైదరాబాద్ రాజధాని అంటారు.. మరోసారి అమరావతి రాజధాని.. సీఆర్డీఏ కొనసాగుతోందంటారు. ఈ కన్ఫ్యూజ్ బొత్సది కాదు ప్రభుత్వానిదేనని అనుకోవాలి.
అయితే అదే సమయంలో శాసనసభలో చట్టాలు చేయవద్దని హైకోర్టు చెప్పిందని ఇది.. ఎలా సాధ్యమని.. దీనిపై చర్చ జరగాల్సిందేనని.. జరుపుతామని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో లేఖ రాయించారు. ఇంకేముంది ఇక అసెంబ్లీలో ఉన్న ప్రివిలేజెస్ వాడుకుని న్యాయవ్యవస్థపై రచ్చ చేస్తారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రాలేదు. హైకోర్టు తమను చట్టాలు చేయవద్దని ఆదేశించిందని .. ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించలేదు. అదే సమయంలో కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీస చర్చ కూడా జరపలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులపై చర్చించినప్పటికీ ఈ విషయం అసలు పరిగణనలోకి తీసుకోలేదు.
మరో వైపు అసెంబ్లీలో న్యాయవ్యవస్థపై చర్చించేంత సాహసం చేయడం మంచిది కాదని హైకమాండ్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వైసీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని సంయమనం పాటించాలని సూచనలు రావడంతో వైసీపీ హైకమాండ్ వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా మరోసారి న్యాయవ్యవస్థతో గొడవపడే పరిస్థితిని కాస్త నిదానం పాటించి.. ఏపీ అధికార పార్టీ నిలువరించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే.. ఒక వేళ ప్రభుత్వాధినేత .. జరపాల్సిందే అంటే.. చర్చ జరగక తప్పదు..కానీ ఇప్పటికైతే పెండిగ్ పడినట్లే అనుకోవాలి.