వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో ప్రభాస్ దుమ్ము దులుపుతున్నాడు. ఆదివారం అంతా టీవీ ఛానళ్లతోనే గడిపేశాడు ప్రభాస్. సోమవారం… ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ తరవాత ఢిల్లీ, కొచ్చిన్ వెళ్లాలి. ఈలోగా అడిగినవాళ్లకు, అడగని వాళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. యాంకర్లతో ఓపిగ్గా మాట్లాడుతున్నాడు. ఫొటోలకు పోజులిస్తున్నాడు. అయితే… టీవీ ఇంటర్వ్యూల సందర్భంగా ఓ సరదా సంఘటన జరిగింది. ఇంటర్వ్యూ అంతా అయిపోయాక.. ఓ యాంకర్ భామ `మీతో ఇన్ స్టా రీల్స్ చేయాలని వుంది.. ఛాన్స్ ఇస్తారా` అని ఉత్సాహంగా అడిగింది. దాంతో ప్రభాస్.. `రీల్సా.. అంటే ఏమిటి` అని అడిగాడు.
‘ఇన్ స్టా రీల్స్ సార్… ‘ అంటూ ప్రభాస్ సరదాగా ఆట పట్టిస్తున్నాడేమో అని.. మళ్లీ మళ్లీ అదే చెప్పుకొచ్చింది యాంకర్. ‘నాకు ఇన్ స్టా రీల్స్ అంటే ఏమిటో తెలీదు..’ అని ప్రభాస్ అనగానే, పక్కనున్న పీఆర్‌టీమ్ అసలు రీల్స్ అంటే ఏమిటో పూస గుచ్చినట్టు వివరించారు. అదంతా తెలుసుకున్నాక.. ‘ఇలాంటివి వద్దు తల్లోయ్’ అంటూ నవ్వుతూనే అక్కడి నుంచి జారుకున్నాడు ప్రభాస్. నిజంగానే ప్రభాస్ కి ఈ సోషల్ మీడియా గురించి పెద్దగా పరిజ్ఞానం లేదు. ఈమధ్యే ఇన్‌స్టాలో అడుగుపెట్టాడు ప్రభాస్. సినిమాల కోసమే ఫేస్ బుక్ ఎకౌంట్లు తెరిచాడు. సౌత్ ఇండియాలోనే ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్టార్లలో ప్రభాస్ ఒకడు. అలాంటిది ప్రభాస్ కి ఇన్ స్టా రీల్స్ గురించి తెలియకపోవడం ఆశ్చర్యమే.