ప్రపంచం మొత్తం ఉమెన్స్ డే జరుపుకుంటోంది. మహిళలు ఎంత గొప్ప వాళ్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. వారి సహనం.. శక్తి గురించి వివరిస్తారు. అంతా బాగానే ఉంటుంది.. కానీ నిజంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా అన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ప్రపంచం సంగతి మనకెందుకు కానీ.. మన దగ్గర ఉన్న పరిస్థితుల్ని ఓ సారి చూద్దాం. చరిత్రలు తిరగేయడం ఎందుకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం హడావుడి ప్రారంభమైన రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే.. మహిళలకు మాటల్లో చెప్పే గౌరవాలు.. చేతల్లో కనీస మాత్రంగా కూడా లేదని అర్థమైపోతుంది.
అత్యున్నత స్థాయిలో ఉన్నా అవమానాలు తప్పడం లేదని తెలంగాణ ప్రథమ పౌరురాలు తమిళిశై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వెలిగక్కారు. రాజకీయంగా తీసుకుని ఆమెకు గవర్నర్ గా ఇవ్వాల్సిన గౌరవం ప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణం. ఇక ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా నేతను ” సింగారించుకుని నెల్లూరుకు ఎవరి కోసం వచ్చిందో ? ” అంటూ అత్యంత దారుణంగా రాజకీయ విమర్శలు చేశారు. ఓ మహిళను ఇంత కంటే అవమానించడం ఎక్కడైనా ఉంటుందా ?. ఇవి మచ్చుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రెండు పరిణామాలు మాత్రమే . ఇలాంటివి సమాజంలో అడుగుడుకూనే ఉంటూనే ఉన్నాయి.
మహిళలు ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం.. జనాభాలోనూ సగమే.. సమాజంలోనూ సగమే. వారు పురుషులతో పోలిస్తే ఎందులోనూ తీసిపోరు. వారికి కల్పించాల్సిన అవకాశాల్ని కల్పించాలి. అప్పుడే వారు తమ సత్తా చూపిస్తారు. అవకాశాలు దక్కించుకున్న వారు ఎలా తమ ప్రతిభ చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవకాశాలతో పాటు వారికి మనం గౌరవం ఇవ్వాలి. మానసికంగా దెబ్బకొట్టడానికి వారిని ఎలాంటి మాటలైనా అనొచ్చు అనే తెంపరి తనాన్ని వదిలేసుకోవాలి. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం కంటే .. వారిని గౌరవించుకోవడం నేర్చుకుంటే.,. అదే పెద్ద మార్పునకు నాంది అవుతుంది.