తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని వారిపై వేటు వేశారు. సెషన్ మొత్తం వారు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. కేసీఆర్కు ఎవరిపైనైనా కోపం వస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని గతంలోనూ వెల్లడయింది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై అనర్హతా వేటు వేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిరేశారని అది మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలిందని … అందుకే అనర్హతా వేటు వేసేశారు. దాన్ని ఎవరూ సవాల్ చేయలేకపోయారు.
ఇప్పుడు కూడా అంతే బీజేపీ ఎమ్మెల్యే లు.. వెళ్లి గవర్నర్కు మొరపెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. తనకే అవమానాలు జరుగుతున్నాయని గవర్నర్ బాధపడుతున్నారు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ సభ్యులు పాల్గొనడం అసంభవమే. అయితే ఇది కేసీఆర్ గొప్ప వ్యూహమా.. లేకపోతే పిరికి తనమా అనే చర్చ సహజంగానే జరుగుతుంది. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారన్న విమర్శలు వస్తాయి. వస్తున్నాయి కూడా. ఈటలకు అసెంబ్లీలో ఎదురుపడటం కేసీఆర్కు ఇష్టం లేదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
అందుకే ఇలా సస్పెన్షన్ వేటు వేయించి బయటకు గెంటేశారన్న ఓ అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలంగా ఏర్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచి వచ్చిన వారిని గౌరవించాలి. అలా చేయకపోతే ప్రజలకూ తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు కేసీఆర్కు అలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ముగ్గురు బీజేపీ సభ్యుల్ని గెంటేయడం వల్ల ఆయన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడవచ్చు కానీ ప్రజల్లో అది అంత సానుకూల సంకేతాలను పంపదని అంచనా వేస్తున్నారు.